హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లో ఏటీఎం క్యాష్ చోరీ కేసు..కర్నాటకలో నిందితుడు అరెస్ట్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లో ఏటీఎం క్యాష్ చోరీ కేసు..కర్నాటకలో నిందితుడు అరెస్ట్
  • రూ.9.53 లక్షలు స్వాధీనం

బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని సుల్తాన్‌‌‌‌‌‌‌‌బజార్ పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్ పరిధిలో జరిగిన ఏటీఎం నగదు రవాణా వాహన దొంగతనం కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించినట్లు ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు షేక్ రెహమాన్‌‌‌‌‌‌‌‌(46)ను కర్నాటకలోని గుల్బర్గా వద్ద అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.9,53,760 నగదు, ఒక మొబైల్ ఫోన్, ఇన్నోవా క్రిస్టా వాహనం తాళంచెవి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 

బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌లోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. మే 19న క్లియర్డ్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(సీఎస్​ఎస్) సిబ్బంది వివిధ వ్యాపార సంస్థల నుంచి నగదు సేకరించి కోఠిలోని ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ ప్రధాన శాఖకు చేరుకున్నారు. ఈ సమయంలో ఇద్దరు కస్టోడియన్లు నగదుతో బ్యాంకులోకి వెళ్లగా, గన్‌‌‌‌‌‌‌‌మెన్ వాష్‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాడు. అదే సమయంలో క్యాష్ రవాణా వెహికల్​ డ్రైవర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న షేక్ రెహమాన్, వాహనంలో ఉన్న రూ.19 లక్షల నగదుతో అక్కడి నుంచి పరారయ్యాడు. కస్టోడియన్ గడ్డం మల్లేశ్​ఫిర్యాదు మేరకు సుల్తాన్‌‌‌‌‌‌‌‌బజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

తర్వాత కింగ్‌‌‌‌‌‌‌‌కోఠి జిల్లా ఆసుపత్రి సమీపంలో వాహనాన్ని గుర్తించిన పోలీసులు, అందులోని రెండు నగదు బ్యాగ్‌‌‌‌‌‌‌‌లలో ఉన్న సుమారు రూ.9.6 లక్షలను నిందితుడు తీసుకెళ్లినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు గుల్బర్గాలో ఉన్నట్లు గుర్తించిన ప్రత్యేక బృందం, మే 21న గుల్బర్గా సబేరా గెస్ట్ హౌస్ వద్ద అతడిని అదుపులోకి తీసుకుంది. ఈ కేసును వేగంగా ఛేదించిన సుల్తాన్‌‌‌‌‌‌‌‌బజార్ పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్ సిబ్బందిని డీసీపీ శిల్పవల్లి అభినందించారు. సమావేశంలో సుల్తాన్‌‌‌‌‌‌‌‌బజార్ ఏసీపీ మట్టయ్య, సీఐ నరేశ్​ పాల్గొన్నారు.