న్యూఢిల్లీ: ఇరాన్–అమెరికా యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లను దాటాయి. ఇదే స్థాయిలో ఎక్కువ కాలం కొనసాగితే ఇండియా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ప్రధాన ఆర్థికవేత్త ఆల్బర్ట్ పార్క్ హెచ్చరించారు. 2026లో సగటు చమురు ధర బ్యారెల్‌కు 96 డాలర్లుగా ఉండొచ్చని, 2027లో ఇది 80 డాలర్లకు తగ్గుతుందని ఆయన అంచనా వేశారు.
‘‘చమురు ధరలు పెరగడంతో భారత జీడీపీ వృద్ధి రేటు 0.6 శాతం మేర తగ్గే ప్రమాదం ఉంది. ఫలితంగా 2026–27 లో వృద్ధి 6.3 శాతానికి పరిమితం కావొచ్చు”అని పార్క్ అన్నారు. ఇండియా జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.9 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతంగా ఉంటుందని ఏడీబీ గతంలో అంచనా వేసింది.
భారత్ తన ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 2.4 శాతం పెరిగి 6.9 శాతానికి చేరే అవకాశం ఉందని పార్క్ తెలిపారు. ఎల్ నినో ప్రభావం వల్ల పంట దిగుబడులు తగ్గడం, ఎరువుల ధరలు పెరగడం వంటి అంశాలు ఆహార ధరలపై ప్రభావం చూపుతాయన్నారు. ఇంధనం, గ్యాస్ సరఫరాలో అంతరాయాలు భారత ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారాయని వివరించారు.
