విద్యుత్ బిల్లులో అదనపు బాదుడుపై జనాల్లో అసంతృప్తి

విద్యుత్ బిల్లులో అదనపు బాదుడుపై జనాల్లో అసంతృప్తి
  • నోటీస్ ఇచ్చాకే వసూలు చేయాలని ఈఆర్సీ సూచన
  • ఈ నెల బిల్లుల్లో కనిపించని చార్జీలు
  • క్యాన్సిల్ చేశారనే భావనలో ప్రజలు
  • ఎఫ్ సీఏ, ఏసీడీపై పబ్లిక్ హియరింగ్ అనంతరం వడ్డింపునకు సన్నాహాలు


హనుమకొండ, వెలుగు: విద్యుత్​ వినియోగదారులను గత నెల కంగారు పెట్టిన ఏసీడీ(అడిషనల్​కన్జంప్షన్ డిపాజిట్) ఈ నెల బిల్లుల్లో కనిపించడం లేదు. ఏసీడీ డ్యూ చెల్లించకపోతే ఫైన్లతో చెల్లించాల్సి ఉంటుందని ఆఫీసర్లు తేల్చి చెప్పగా.. ఈసారి బిల్లుల్లో దాని ఊసే లేకపోవడంతో జనాలు కన్ఫ్యూజన్​లో పడ్డారు. గత నెలలో విధించిన మేరకు కొంతమంది ఏసీడీ బిల్లులు కట్టగా.. పోయిన నెల కట్టనివారికి ఈసారి బిల్లుల్లో ఎలాంటి డ్యూ కనిపించడం లేదు. అసలు ఆ ఛార్జీ  క్యాన్సిల్ ​చేస్తున్నట్టుగానో.. తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగానో అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ చేయకున్నా.. బిల్లుల్లోంచి తొలగించడంతో జనం అయోమయంలో పడ్డారు. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు ఆఫీసర్లను అడిగినా క్లారిటీ ఇవ్వకపోవడంతో బిల్లు రద్దయ్యిందనే భావనకు వస్తున్నారు.

ఈఆర్సీ సూచన మేరకే..

ఇదివరకు ఇండస్ట్రీలు, కమర్షియల్​ కనెక్షన్లకు విధించిన ఏసీడీ ఛార్జీలు గతేడాది నుంచి డొమెస్టిక్​ కనెక్షన్లకు కూడా విధిస్తున్నారు. నిరుడు డొమెస్టిక్​ కనెక్షన్లలో ఏడాదిలో నెలకు సగటున 300 యూనిట్లు దాటిన వారికే మాత్రమే విధించిన ఛార్జీలు.. ఈ ఏడాది నుంచి 300 యూనిట్లలోపు కాల్చిన వారి నుంచి కూడా వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. టీఎస్​ఎన్​పీడీసీఎల్​ పరిధిలో 7.16 లక్షల వినియోగదారుల నుంచి రూ.305 కోట్లు మొండి బకాయిలు ఉన్నాయని, దీంతో విద్యుత్​ సంస్థల నష్టాన్ని నివారించేందుకే 300 యూనిట్లలోపు వినియోగదారుల నుంచి కూడా ఏసీడీ డ్యూ వసూలు చేస్తున్నట్లు సీఎండీ గోపాలరావు కూడా చెప్పారు. ఈ మేరకు జనవరి నెలలో ఏసీడీ  పేరున బిల్లులో డ్యూ కూడా చూపించారు. జనవరి నెలను నోటీస్​పీరియడ్​గా చూపించి, ఫిబ్రవరి నెలలో ఏసీడీ కచ్చితంగా కట్టాల్సిందేనని చెప్పారు. కానీ  టీఎస్​ఎన్పీడీసీఎల్​పరిధిలోని విద్యుత్​ వినియోగదారులకు కనీస సమాచారం లేకుండా వారిపై ఏసీడీ భారం మోపగా.. విద్యుత్​ సంస్థలు, ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. 300 యూనిట్లలోపు వాడే విద్యుత్​ వినియోగదారులే 80 శాతం వరకు ఉండటంతో  ఎక్కడికక్కడ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నుంచి ఆందోళనలు వెల్లువెత్తాయి.  తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్​(ఈఆర్సీ)కు కూడా ఫిర్యాదులు అందాయి. దీంతోనే తాత్కాలికంగా ఏసీడీ వసూలు నిలిపివేయాలని సీఎండీకి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ప్రజలకు నోటీసులు ఇవ్వకుండా ఏసీడీ విధించకూడదని చెప్పినట్లు సమాచారం. దీంతోనే ఫిబ్రవరి నెల బిల్లులో ఏసీడీ డ్యూ చూపించనట్లు తెలుస్తోంది.

నెల తర్వాత వాతే..

వచ్చే ఏప్రిల్​ నుంచి కరెంట్ బిల్లుల్లో ఫ్యుయల్​కాస్ట్ అడ్జెస్ట్మెంట్(ఎఫ్​సీఏ) పేరిట  మరో కొత్త ఛార్జీ​ వసూలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం గెజిట్​కూడా ప్రవేశపెట్టింది. దాంతోపాటు ఏసీడీ బిల్లులపై రగడ జరుగుతున్న నేపథ్యంలో ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణకు రెడీ అయింది. ఈ మేరకు ఈ నెల 22న హనుమకొండలో పబ్లిక్ హియరింగ్​ నిర్వహించనుంది. అందులో ప్రజల అభిప్రాయాలు సేకరించిన తరువాత ఈఆర్సీ సిఫారసుల మేరకు ఇటు ఏసీడీ, అటు ఎఫ్​సీఏ  బిల్లులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా ఏసీడీ ఛార్జీ​ క్యాన్సిల్ చేస్తున్నట్లు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేవని, నెల రోజుల నోటీస్​పీరియడ్​ తరువాత మళ్లీ వసూలు చేస్తారని టీఎస్​ఎన్​పీడీసీఎల్​పరిధిలోని ఓ ఆఫీసర్​ చెప్పారు. మార్చి నెలలో ఏసీడీ, ఏప్రిల్​ లో ఎఫ్​సీఏ బాదుడు తప్పదని వివరించారు.