GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్

GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్

బెంగుళూరు బౌలర్ల ధాటిగా గుజరాత్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన చిన్నస్వామి పిచ్ పై కనీసం పోరాడే లక్ష్యాన్ని నిర్ధేశించలేకపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజ‌రాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 147 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది.

బ్యాటింగ్‌కు దిగిన గుజ‌రాత్‌ను సిరాజ్.. బెంబేలెత్తించాడు. తొలి ఓవర్‌లో వృద్ధిమాన్ సాహా(1)ను పెవిలియన్ చేర్చిన సిరాజ్.. తన మరుసటి ఓవర్‌లో శుభ్‌మ‌న్ గిల్(2)లు ఔట్ చేశాడు. ఆపై కొద్దిసేపటికే సాయి సుదర్శన్(6)ను.. కామెరూన్ గ్రీన్ వెనక్కి పంపాడు. ఆ సమయంలో మిల్లర్(30; 20 బంతుల్లో 3 ఫోర్లు. 2 సిక్స్‌లు)- షారుఖ్ ఖాన్(37; 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) జట్టును ఆదుకున్నారు. ప్రమాదకరంగా మారుతోన్న ఈ జోడీని కరణ్ శర్మ విడదీశాడు. మిల్లర్‌ను ఔట్ చేసి.. 69 పరుగుల భాస్వామ్యానికి తెరదించాడు. అక్కడినుంచి మ్యాచ్ తలకిందులైంది.

రాహుల్ తెవాటియా (35), రషీద్‌ ఖాన్‌ (18) జోడి టైటాన్స్‌ను గట్టెక్కించేలా కనిపించినా.. అనవసరపు షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. ఇక విజయ్‌ కుమార్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో వరుసగా 3 వికెట్లు పడ్డాయి. బెంగళూరు బౌలర్లలో సిరాజ్, యశ్‌ దయాల్, విజయ్‌ కుమార్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. కరణ్ శర్మ, కామెరూన్ గ్రీన్‌లకు తలో వికెట్ దక్కింది.