అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతోన్న చిత్రం ‘డెకాయిట్’. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 10న సినిమా విడుదల కానుంది. తాజాగా షూటింగ్ పూర్తవడంతో సెట్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ ‘ఒక కొత్త జానర్‌లో యాక్షన్ బ్లెండ్ చేసిన లవ్‌స్టోరీ ఇది. విడిపోయిన మాజీ ప్రేమికులు, వాళ్ళ జర్నీలో ఏం రియలైజ్ అవుతారో ఇందులో చాలా స్పెషల్ గా ఉంటుంది. చుట్టూ గన్స్ బుల్లెట్స్ ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఎమోషన్ ఎలా ఉంటుందనేది కొత్తగా చూపించాం. ఇందులోని ఎమోషన్ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది’ అని చెప్పాడు. ఈ చిత్రం అందరికీ మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందని డైరెక్టర్ షానియల్ డియో అన్నాడు. ‘ఇదొక బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ అని, ఇలాంటి మంచి కథలో పార్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉందని బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ అన్నాడు. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అని ప్రొడ్యూసర్ సుప్రియా యార్లగడ్డ చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, కొరియోగ్రాఫర్ విజయ్, ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర పాల్గొన్నారు.
