భారత్ లో ఆత్మాహుతి దాడులు : అల్ ఖైదా వార్నింగ్ 

భారత్ లో ఆత్మాహుతి దాడులు : అల్ ఖైదా వార్నింగ్ 
  • ప్రవక్తను అవమానించిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిక

న్యూఢిల్లీ : మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా హెచ్చరించింది. బీజేపీ మాజీ అధికార ప్రతినిధులు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ వ్యాఖ్యలను ఖండించిన ముస్లిం దేశాల జాబితాలోకి తాజాగా ఉగ్ర సంస్థ అల్ ఖైదా కూడా చేరింది. ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని.. అందుకు దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడుతామని అల్ ఖైదా హెచ్చరికలు జారీ చేసింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని హతమారుస్తామంటూ వార్నింగ్‌ ఇచ్చింది.

ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్‌ల్లో దాడులకు దిగుతామంటూ ఈ నెల 6వ తేదీన(జూన్ 6న) ఓ లేఖ విడుదల చేసింది. ‘మేం, మా పిల్లలు ఒంటినిండా పేలుడు పదార్థాలు చుట్టుకుని వారిని పేల్చేస్తాం. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్‌ల్లోని కాషాయ ఉగ్రవాదులు చనిపోయేందుకు సిద్ధంగా ఉండండి’ అని హెచ్చరించింది. మరో ఉగ్ర సంస్థ ఎంజీహెచ్‌ కూడా ముహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ ‘నూపుర్‌ శర్మ బేషరతుగా ప్రపంచానికి క్షమాపణ చెప్పాలి..లేదంటే ప్రవక్తను అగౌరవపరిచినందుకు ఏం చేయాలో అది చేస్తాం’ అంటూ టెలిగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది.

కొంతమంది వ్యక్తుల వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదని భారత దౌత్యాధికారులు ఇప్పటికే ఆయా దేశాలకు స్పష్టం చేశారు. మహ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై బీజేపీ చర్యలు తీసుకుందని వివరించారు. సర్వ మతాలను గౌరవించడం భారతీయ సంస్కృతిలోనే ఉందని చెప్పారు.