
వరల్డ్ నంబర్‌వన్, టాప్ సీడ్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ వింబుల్డన్‌లో వరుసగా రెండో ఏడాది మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో అల్కరాజ్ (స్పెయిన్) 6–4, 7–6 (7/2), 6–3తో అలెగ్జాండర్ ముల్లర్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. 2 గంటలా 33 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్పెయిన్ ప్లేయర్ అద్భుతమైన సర్వీస్‌లతో ఆకట్టుకున్నాడు. తొలి సెట్‌లో ఒకే ఒక్క బ్రేక్ పాయింట్ సాధించిన అల్కరాజ్ రెండో సెట్ టైబ్రేక్‌లో మాత్రం రెచ్చిపోయాడు. బేస్‌లైన్ గేమ్‌తో పాటు క్రాస్ కోర్టు విన్నర్స్‌తో ముల్లర్‌ను కట్టిపడేశాడు. కీలకమైన మూడో సెట్ ఎనిమిదో గేమ్‌లో ముల్లర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అల్కరాజ్ తర్వాతి గేమ్‌లో విజయవంతంగా సర్వీస్‌ను కాపాడుకున్నాడు.
మ్యాచ్ మొత్తంలో అల్కరాజ్, ముల్లర్ చెరో ఐదు ఏస్‌లు కొట్టారు. అయితే అల్కరాజ్ మూడు డబుల్ ఫాల్ట్స్ చేసినా, తన సర్వీస్‌లో 76 శాతం పాయింట్లు సాధించాడు. 14 బ్రేక్ పాయింట్లలో రెండింటిని మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. ఇక ముల్లర్ 29 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్‌తో పాటు ఒక్క బ్రేక్ పాయింట్‌ను కూడా సాధించలేకపోయాడు. 21 విన్నర్లకే పరిమితమయ్యాడు. ఇతర మ్యాచ్‌ల్లో మూడోసీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–3, 6–3, 7–6 (7/5)తో మనారినో (ఫ్రాన్స్)పై, జాన్ సినెర్ (ఇటలీ) 3–6, 6–2, 6–3, 6–4తో హాలెస్ (ఫ్రాన్స్)పై, జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 5–7, 6–2, 6–2తో వాటనుకి (జపాన్)పై, రునె (డెన్మార్క్) 6–3, 7–6 (7/3), 6–4తో కార్బెల్లాస్ బియాన్ (స్పెయిన్)పై, యుబాంక్స్ (అమెరికా) 6–3, 3–6, 6–2, 7–6 (7/3)తో నోరి (బ్రిటన్)పై గెలిచి తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించారు.
ముర్రేకు షాక్
గాయంతో చాలా రోజుల నుంచి ఆటకు దూరంగా ఉన్న బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రేకు రెండో రౌండ్‌లోనే షాక్ తగిలింది. ఐదోసీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 7–6 (7/3), 6–7 (2/7), 4–6, 7–6 (7/3), 6–4తో ముర్రేపై పోరాడి గెలిచాడు. 4 గంటలా 40 నిమిషాల మ్యాచ్‌లో బ్రిటన్ ప్లేయర్ శక్తి మేరకు పోరాడినా టైబ్రేక్‌లో విఫలమయ్యాడు. దీంతో ఎక్కువ బ్రేక్ పాయింట్లను సాధించలేకపోయాడు. కీలకమైన నాలుగో సెట్ టైబ్రేక్‌లో సిట్సిపాస్ బలమైన సర్వీస్‌లను ముర్రే అడ్డుకోలేకపోయాడు.
సబాలెంక జోరు
విమెన్స్ సింగిల్స్‌లో అరీనా సబాలెంకా జోరు కొనసాగిస్తోంది. రెండో రౌండ్‌లో సెకండ్ సీడ్ సబాలెంక 2–6, 7–5, 6–2తో వార్వరా గ్రాచెవా (ఫ్రాన్స్)ను ఓడించింది. గంటా 58 నిమిషాల మ్యాచ్‌లో తొలి సెట్‌లో సబాలెంక తడబడింది. ప్రత్యర్థి సర్వీస్‌లకు సరైన జవాబివ్వలేకపోయింది. కానీ రెండో సెట్ నుంచి సర్వీస్‌ల్లో పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. ప్రత్యర్థి సర్వ్‌లను బ్రేక్ చేయడంతో పాటు కీలక టైమ్‌లో బ్రేక్ పాయింట్లను కాచుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో క్విటోవా (చెక్) 6–2, 6–2తో సనోవిచ్ (రష్యా)పై, పెగులా (అమెరికా) 6–4, 6–0తో కొకియారెటో (ఇటలీ)పై, మాడిసన్ కీస్ (అమెరికా) 7–5, 6–3తో గౌల్బిక్ (స్విట్జర్లాండ్)పై నెగ్గారు.