బర్మింగ్‌హామ్: ఇండియా స్టార్ షట్లర్ లక్ష్య సేన్.. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మూడోసారి సెమీస్‌లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–-13, 21–16 -తేడాతో ఆరో ర్యాంకర్ చైనా షట్లర్ లీ షి ఫెంగ్ కు చెక్ పెట్టాడు. దాంతో గతేడాది ఇదే టోర్నీలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. ముఖాముఖి రికార్డును 7–7తో సమం చేశాడు.
గంట పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్ బలమైన సర్వీస్‌లు, క్రాస్ కోర్టు విన్నర్లతో రెచ్చిపోయాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన లక్ష్య ఏ దశలోనూ ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఫెంగ్ కొట్టిన ప్రతి షాట్‌ను రిటర్న్ చేశాడు. తొలి గేమ్‌లో లక్ష్య షాట్లను తీయలేకపోయిన ఫెంగ్.. రెండో గేమ్‌లో కొద్దిగా ప్రతిఘటన ఇచ్చాడు. అయినా ఎక్కడా స్కోరును సమం చేయలేదు. 2022, 2024లోనూ ఇండియన్ ప్లేయర్ సెమీస్‌కు చేరాడు.
