టికెట్ కావాలా అప్లికేషన్ పెట్టుకోండి.. మున్సిపల్ ఎన్నికల్లో మారిన ట్రెండ్

టికెట్ కావాలా అప్లికేషన్ పెట్టుకోండి.. మున్సిపల్ ఎన్నికల్లో మారిన ట్రెండ్
  •  ఆశావహుల నుంచి అప్లికేషన్లు 
  • తీసుకుంటున్న పార్టీలు  వాటి సాయంతో ఎంక్వైరీలు, సర్వేలు
  • గెలిచే అవకాశమున్న వారికే టికెట్లు ఇచ్చే ప్లాన్​

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ప్రధాన పార్టీలు కొత్త ట్రెండ్‌‌‌‌‌‌‌‌కు తెరతీశాయి. పిలిచి టికెట్లు ఇచ్చే పద్ధతికి తెరదించుతూ ఆశావహుల నుంచే నేరుగా అప్లికేషన్లు తీసుకుంటున్నాయి. వాటి ద్వారా ఎంక్వైరీలు, సర్వేల ద్వారా ప్రజల్లో పలుకుబడి, విజయావకాశాలను అంచనా వేసి టికెట్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఒక పద్ధతి ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగడం వల్ల పార్టీ విజయావకాశాలు మెరుగుపడడంతో పాటు రెబల్స్ బెడద ఉండదని భావిస్తున్నాయి. మరోవైపు, మున్సిపల్ ఎన్నికల్లో ఆశావాహుల నుంచి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అప్లికేషన్లు తీసుకుంటున్నాయి. ప్రధాన పార్టీల్లో ఒక్కో డివిజన్ నుంచి సగటున 4 నుంచి 8 మంది దాకా పోటీ పడ్తున్నారు. మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌లో మూడు ప్రధాన పార్టీల నుంచి ఏకంగా 1,069 అప్లికేషన్లు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి 373, బీజేపీ నుంచి 250 రాగా, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నుంచి 446 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇక్కడ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో 4వ డివిజన్ నుంచి పోటీ చేయడానికి ఏకంగా 20 మంది పోటీ పడ్తున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులకు కాంగ్రెస్ పార్టీ నుంచి 526 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో ఒక్క 12వ వార్డ్ కోసం 29 మంది దరఖాస్తు చేసుకున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ 2వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి 13 మంది చొప్పున పోటీ పడుతున్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 8వ వార్డు స్థానానికి కాంగ్రెస్ తరఫున 12 మంది, బీఆర్ఎస్ తరఫున 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. 

 వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపిక.. 

అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అధికార కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ గెలుపు బాధ్యతను పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా మంత్రులకు అప్పగించింది. ప్రతి చోటా కనీసం 70 శాతం వార్డులు, డివిజన్లు గెలిపించుకొని రావాలని హైకమాండ్ నిర్దేశించింది. దీంతో రాష్ట్ర మంత్రులు ఆయా చోట్ల ఎమ్మెల్యేలు, డీసీసీ ప్రెసిడెంట్లు, పార్టీ సీనియర్ నాయకులతో సమన్వయం చేసుకుంటున్నారు. ఆశావహుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఫీల్డ్ ఎంక్వైరీలు, సర్వేల ద్వారా అప్లికేషన్లను వడబోసి గెలుపు అవకాశాలు ఉన్న ముగ్గురు పేర్లతో లిస్టులు రెడీ చేసి ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రులకు పంపిస్తున్నారు. ఇందులో నుంచి ఒకరి పేరును ఫైనల్ చేసి, పార్టీ తరుఫున ‘బీ’ఫారం అందించనున్నారు. అదే రోజు మిగిలిన ఇద్దరికి సర్దిచెప్పి రెబల్స్ బెడద రాకుండా చూడాలని నిర్ణయించారు. ఇక, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ లీడర్లకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతలు అప్పగించారు. గతంలో పార్టీ తరుఫున కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలిచి పదవులు పొందిన వారిలో ఎక్కువ మంది ఈసారి కూడా పోటీకి ముందుకొస్తున్నారు. 

బీజేపీలోనూ అప్లికేషన్ల జోరు..

బీజేపీలోనూ అప్లికేషన్ల ప్రక్రియ జోరందుకుంది. పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్​ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువ మున్సిపాలిటీలను గెలుచుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఈ ఎన్నికల కోసం ఇప్పటికే కేంద్రం నుంచి ముగ్గురు ఎన్నికల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిలను నియమించారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులకు ఉమ్మడి జిల్లాలవారీగా బాధ్యతలను అప్పగించారు.