గల్లీ లీడర్ నుంచి పార్టీ బాస్ వరకు... అన్ని పార్టీల్లో సర్ హంగామా

గల్లీ లీడర్ నుంచి పార్టీ బాస్ వరకు... అన్ని పార్టీల్లో సర్ హంగామా
  •     జీహెచ్ఎంసీ, పరిషత్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్​ జాబితా సవరణపై అన్ని పార్టీలు అలర్ట్​
  •     ఈసీని మించి మీటింగ్‌‌‌‌లు, బీఎల్వోలను మించి బీఎల్‌‌‌‌ఏలకు ట్రైనింగ్‌‌‌‌లు 
  •     అవసరమైన ధ్రువపత్రాలపై కేడర్‌‌‌‌‌‌‌‌కు అవగాహన కార్యక్రమాలు
  •     2002 లిస్ట్​తో మ్యాపింగ్‌‌‌‌లో 30 శాతం ఓటర్లు మిస్

హైదరాబాద్, వెలుగు: గల్లీ లీడర్ నుంచి పార్టీ బాస్ వరకు.. వార్డు మెంబర్ నుంచి పార్టీ కేడర్‌‌‌‌ వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హడావుడి. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్) హంగామా  సృష్టిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కంటే ఒక అడుగు ముందే ఉంటూ పార్టీల అధినాయకత్వాలు అంతర్గత సమావేశాల జోరు పెంచాయి. ప్రభుత్వ యంత్రాంగం నియమించిన బూత్ లెవెల్ ఆఫీసర్ల కంటే మిన్నగా.. తమ పార్టీల తరఫున బూత్ లెవెల్ ఏజెంట్లను (బీఎల్‌‌ఏ) రంగంలోకి దించి, వారికి కార్పొరేట్ స్థాయిలో శిక్షణా తరగతులు నిర్వహిస్తుండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌‌గా మారింది.  ఓటు నమోదు, మార్పులు చేర్పుల కార్యక్రమం కేవలం ఒక అధికారిక ప్రక్రియగానే కాకుండా, పార్టీల మనుగడకు, భవిష్యత్ విజయాలకు పునాదిగా మారడంతో గ్రౌండ్ లెవల్‌‌లో నాయకులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే కావడంతో, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల ద్వారా తమ పట్టును భద్రపరుచుకునేందుకు రాజకీయ శ్రేణులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.

బీఎల్‌‌ఏలకు హైటెక్ శిక్షణ 

సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక మేల్కొనే రాజకీయ పార్టీలు.. ఈసారి జీహెచ్‌‌ఎంసీ, పరిషత్ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ముందే అలర్ట్ అయ్యాయి. ఈసీ యంత్రాంగం నిర్వహించే సమీక్షల కంటే ఎక్కువగా పార్టీ కార్యాలయాల్లో నిత్యం ‘ఓటరు’ మథనం సాగుతోంది. బీఎల్ఏలకు ప్రత్యేకంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులపై బీఆర్‌‌‌‌ఎస్‌‌, కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు గ్రౌండ్ లెవెల్‌‌లో హోరెత్తిస్తున్నాయి. తమకు పట్టున్న ప్రాంతాల్లో ఓట్ల తొలగింపు జరగకుండా చూసుకోవడం లక్ష్యంగా పార్టీల ‘సర్’  సమీక్ష నడుస్తున్నది.  ఓటరు జాబితాలో పేర్ల నమోదు ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా కేడర్‌‌‌‌కు పార్టీల లీగల్ సెల్ ప్రతినిధులు క్లాసులు తీసుకుంటున్నారు. నివాస ధ్రువీకరణ పత్రాలు (అడ్రస్ ప్రూఫ్స్), ఆధార్, పుట్టిన తేదీ సర్టిఫికెట్ల సమర్పణపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. ఆన్‌‌లైన్ దరఖాస్తుల్లో చిన్న పొరపాటు దొర్లినా ఫామ్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉండటంతో.. ప్రతి దరఖాస్తును పార్టీ ప్రతినిధులే స్వయంగా పరిశీలిస్తున్నారు.  దొంగ ఓట్లకు అడ్డుకట్ట వేస్తూనే, తమ సానుభూతిపరుల ఓట్లు మిస్ కాకుండా చూసేందుకు ఈ ‘సర్టిఫికెట్ గైడెన్స్’ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు.

సీఎం దగ్గర నుంచి.. ప్రతిపక్ష లీడర్ల దాకా అందరూ అదే జపం

 ‘సర్’  ప్రక్రియపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా కార్యక్రమాన్ని చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మంత్రులు, నియోజకవర్గ ఇన్‌‌చార్జీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో అత్యవసర సమీక్షలు జరిపి దిశానిర్దేశం చేశారు. నిజమైన ఓటర్ల పేర్లు ఎక్కడా గల్లంతు కాకుండా చూడటమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను అలర్ట్ చేశారు. జూన్ 20 నాటికి పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఇన్‌‌చార్జీలతో సమీక్షలు పూర్తి చేసి.. ప్రతి బూత్ పరిధిలో కాంగ్రెస్ ప్రతినిధులను నియమించి, ఇంటింటి సర్వేలో లోపాలు లేకుండా చూసే బాధ్యతను కేడర్‌‌‌‌కు అప్పగించారు.  ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అధికార పక్షంపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే.. క్షేత్రస్థాయిలో ‘ఓటు రక్షణ’ పేరుతో కార్యాచరణ ప్రారంభించింది. ఓటర్ల సవరణ సాకుతో తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను అక్రమంగా తొలగించే అవకాశం ఉందంటూ తమ బూత్ లెవెల్ ఏజెంట్లను భారీస్థాయిలో అప్రమత్తం చేసింది.

ఇందుకోసం డివిజన్, మండల కేంద్రాల్లో లీగల్ సెల్ ప్రతినిధులతో ప్రత్యేక శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో బీఎల్‌‌ఓల వెరిఫికేషన్‌‌ను డేగకన్నుతో గమనిస్తూ, ఎక్కడైనా ఓటు అక్రమంగా తొలగిస్తే వెంటనే ఈసీకి ఫిర్యాదు చేసేలా ఫామ్‌‌లవారీగా కేడర్‌‌‌‌కు శిక్షణ ఇస్తోంది.  మరోవైపు బీజేపీ ‘సర్’​ ప్రక్రియను ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఒక ఆయుధంగా మలుచుకునేలా ‘యాక్షన్ ప్లాన్’ సిద్ధం చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలో పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న బోగస్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లను ఏరిపారేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్‌‌ రివిజన్ ద్వారా అక్రమంగా చేరిన ఓట్లను గుర్తించి వాటిని తొలగించేందుకు వీలుగా ప్రతి పోలింగ్ బూత్‌‌లోనూ తమ ఏజెంట్లు కచ్చితంగా అందుబాటులో ఉండేలా జిల్లాల వారీగా సమీక్షల జోరు పెంచింది.

కోటి మంది ఓటర్లకు మ్యాపింగ్​ జరగలే

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.35 కోట్ల ఓటర్లు ఉండగా.. ఇప్పటికే 2002 ఓటర్ల జాబితా మ్యాపింగ్​ చేశారు. ఇందులో 70 శాతం వరకే పూర్తయింది. అంటే మొత్తం ఓటర్లలో దాదాపు కోటి ఓటర్లు మ్యాపింగ్‌‌లోకి రాలేదు. అయితే మ్యాపింగ్​ జరకగపోయినా ఇబ్బంది లేదని, తర్వాత జరిగే ప్రక్రియలో ఇచ్చే ఫామ్‌‌లను పక్కాగా నింపితే ఓటు హక్కు ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. ఓటరు కార్డుల్లో దొర్లే చిన్నచిన్న తప్పులకు (స్పెల్లింగ్ మిస్టేక్స్, టైపోగ్రాఫికల్ ఎర్రర్స్) ఓటర్లు గానీ, రాజకీయ పార్టీల ప్రతినిధులు గానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్థానిక విచారణ (ఫీల్డ్ వెరిఫికేషన్) సమయంలో బీఎల్‌‌ఓలు వీటిని సరిచేస్తారని భరోసా ఇస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే తమ లక్ష్యమని, రాజకీయ పార్టీలు నిబంధనల ప్రకారం ఈసీకి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.