హైదరాబాద్: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోయే ‘డీలిమిటేషన్’ అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. లోక్‌సభ స్థానాలను ఏకంగా 50 శాతం పెంచుతామని కేంద్ర ప్రభుత్వం సంకేతాలిస్తున్న తరుణంలో.. ఆ పెంపు ఏ ప్రాతిపదికన జరుగుతుందనేది ప్రశ్నగా మారింది. ఈ అంశంపై.. బేగంపేట టూరిజం ప్లాజాలో తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో సమాఖ్య రాజ్యాంగానికి తూట్లు పొడిచే డీ లిమిటేషన్ అనే అంశంపై అఖిల పక్ష సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో.. ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. మూడేళ్లు శ్రమించి తయారు చేసిన రాజ్యాంగాన్ని.. మూడు రోజుల్లోనే మార్చేస్తారా అని విస్మయం వ్యక్తం చేశారు. రాజ్యాంగ సవరణల పేరుతో రాజ్యాంగానికి మరణ శాసనాలు చేస్తున్నారని మండిపడ్డారు. మూడు రోజుల్లోనే సభ్యులు డ్రాఫ్ట్ చదివి వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలని అంటున్నారని, ఇంత తక్కువ సమయం అంటే.. అంతర్లీనంగా ఏదో ఉందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్లకు... డీ లిమిటేషన్కు ఉన్న సంబంధం ఏంటని నిలదీశారు.
లెక్కలేని తనం వల్ల మన లెక్కలు మారిపోతున్నాయని, ఇలా చేస్తే రాజ్యాంగం ఏమైపోతుందోననే భయం కలుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అన్నింటినీ మానిప్యులేట్ చేస్తారని, ఎన్నికల కమిషన్ను కూడా ప్రభావితం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల ద్వారా మనం రాజ్యాంగాన్ని నిలబెట్టుకునే అవకాశమే ఉంటే.. ఇప్పుడు ఎందుకు ఈ సమస్య వచ్చిందని ప్రశ్నించారు.
ఈ కొత్త సవరణలను అంబేద్కర్ చదివి ఉంటే.. ఇలా కూడా రాయొచ్చా అని ఆశ్చర్యపోయే వారేమోనని మాడభూషి శ్రీధర్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రజలు కదలాల్సిన సమయం ఇదని, జాతి, జాతీయత అనేదాన్ని కులం, మతాలకు ముడిపెట్టారని కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

