ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

‘రామప్ప’లో రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి :   కలెక్టర్ కృష్ణ ఆదిత్య 

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు :  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  రామప్ప టెంపుల్ విజిట్​కు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం ‘రామప్ప’లో  కలెక్టర్, ఏఎస్పీ సుధీర్ రామ్​నాథ్​కేకేన్, అడిషనల్ కలెక్టర్ వైవి గణేశ్​తో కలిసి  ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రాష్ట్రపతి రామప్పలో పర్యటిస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రసాద్ స్కీం’ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఆదివాసీ కళా బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు  నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.  రామప్ప  గార్డెన్ ను ముస్తాబు చేయడంతో పాటు ప్రాంగణమంతా శానిటైజ్​చేసి ప్రత్యేక సిబ్బందిని నియమించామని చెప్పారు.   రామప్ప పరిసర ప్రాంతాల్లో నిషేదాజ్ఞలు జారీ చేశామన్నారు. పోలీసులతో పాటు అన్ని శాఖల ఆఫీసర్లు సమన్వయం చేసుకుంటూ రాష్ట్రపతి టూర్​ను సక్సెస్​చేయాలని  ఆదేశించారు. పోలీస్ కమాండర్ ఆదిత్య దత్ రాయ్ రామప్పకు చేరుకొని  భద్రతా ఏర్పాట్ల గురించి  కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. డీఆర్వో కె. రమాదేవి, డీపీవో కె. వెంకయ్య, పంచాయతీ రాజ్​ఈఈ రవీందర్ తదితరులు ఉన్నారు. 

రైతులకు రుణమాఫీ ఎందుకు చేస్తలేరు? : బీజేపీ జిల్లా అధ్యక్షుడు దశమంత్​రెడ్డి

జనగామ, వెలుగు : రైతు సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే సీఎం కేసీఆర్​నేటి వరకు రైతులకు రుణమాఫీని ఎందుకు చేస్తలేరని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్​రెడ్డి ప్రశ్నించారు. సోమవారం జిల్లా పార్టీ ఆఫీస్ లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ సర్కార్​తొమ్మిదేండ్ల పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. ‘రైతు బంధు’ పేరుతో రైతులకు ఇచ్చే అన్ని సబ్సిడీలకు కేసీఆర్​ఎగనామం పెట్టిండని విమర్శించారు. ధరణి పోర్టల్​వల్ల 25 లక్షల మంది రైతులకు పట్టా పాస్​బుక్స్​ అందలేదన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న కలెక్టరేట్​ఎదుట మహాధర్నా చేస్తున్నామని తెలిపారు.  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  కేవీఎల్ఎన్ రెడ్డి, ఉడుగుల రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సౌడ రమేశ్​ తదితరులు పాల్గొన్నారు. 

బాధితులకు భరోసా కల్పించాలి

మొగుళ్లపల్లి (టేకుమట్ల), వెలుగు: వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు భరోసా కల్పించి, న్యాయం చేయాలని భూపాలపల్లి డీఎస్పీ రాములు సూచించారు. సోమవారం టేకుమట్ల  పీఎస్​ను డీఎస్పీ విజిట్​చేశారు. పీఎస్ లోని పలు రికార్డులను చెక్​చేశారు.  ఈ  సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ విధుల్లో నిబద్ధత,  సమయస్ఫూర్తి కలిగి ఆపదలో ఉన్నవారికి అండగా ఉండాలని సూచించారు. పోలీస్ సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని రౌడీషీట్లు ఉన్న పాత నేరస్తులపై ఫోకస్​పెట్టాలని ఎస్సైని ఆదేశించారు. ఎస్సై చల్లా  రాజు, సిబ్బంది ఉన్నారు. 

ప్లెక్సీల తొలగింపులో ఆఫీసర్ల నిర్లక్ష్యం

కమలాపూర్, వెలుగు : ప్రతిపక్ష పార్టీలు పర్మిషన్లు తీసుకుని ప్లెక్సీలు కట్టినా.. ఎన్నో రూల్స్​ మాట్లా డే  ఆఫీసర్లు  కమలాపూర్​  మండల కేంద్రంలో అధికార పార్టీ ప్లెక్సీలు ప్రమాదకరంగా ఉన్నా తొలగించడం లేదు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్​ రెడ్డి బర్త్​డే సందర్భంగా ఈ నెల 21న కమలాపూర్​ మండల కేంద్రంలోని మెయిన్​రోడ్డు, సెంటర్లలో బీఆర్ఎస్​లీడర్లు భారీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. బర్త్​డే జరిగి 5 రోజులు గడిచినప్పటికీ రోడ్డుపై ఏర్పాటు చేసిన ప్లెక్సీలను తొలగించకుండా ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో రోడ్డుపై అడ్డుగా ఉన్న ప్లెక్సీలతో ప్రమాదాలు జరిగితే ఎట్లా?  బాధ్యత ఎవరిది? అని  ప్రశ్నిస్తున్నారు. వాహనదారుల దృష్టిని మళ్లించే విధంగా ఉన్న ప్లెక్సీలను  వెంటనే తొలగించాలని  స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు.

రాష్ట్రపతిని కలసిన మానుకోట ప్రతినిధులు

మహబూబాబాద్​అర్బన్, వెలుగు :  శీతాకాల విడిది కోసం హైదరాబాద్​లోని బొల్లారం కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు  ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్​రావు, ఎంపీ మాలోత్​ కవిత, ఎమ్మెల్యే శంకర్​నాయక్, మున్సిపల్​చైర్మన్​డాక్టర్​ పాల్వాయి రామ్మోహన్​రెడ్డి కలసి పుష్పగుచ్ఛాన్ని రాష్ట్రపతికి అందజేశారు.  

విభజన హామీల అమలుకు కేంద్రంపై పోరాటం

కాజీపేట, వెలుగు :  రాష్ట్ర విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని ప్రభుత్వ చీఫ్​విప్​దాస్యం వినయ్ భాస్కర్  ఆరోపించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు విభజన హామీలపై కేంద్రం  నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కాజీపేట చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వినయ భాస్కర్​మాట్లాడుతూ.. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు బీజేపీ ప్రభుత్వం కాజీపేట ప్రజల కలను కలగానే మిగిల్చాయన్నారు.  తెలంగాణపై వివక్ష చూపడం బీజేపీ డీఎన్ఏలోనే ఉందని మండిపడ్డారు. బీజేపీ తీరుపై దశలవారీ పోరాటం చేస్తామని హెచ్చరించారు. కూడా చైర్మన్ సుందర్రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.