వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఎస్సారెస్పీ (SRSP) కాలువలో పడి గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే... కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కేయూ సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు ఈత కోసం వెళ్లారు. నీటి ప్రవాహం ఉధృతిని గమనించక పోవడంతో ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగిపోయారు.
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఒక విద్యార్థి మృతదేహం లభ్యం కాగా, మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. చేతికి అందొచ్చిన కొడుకులు కళ్లముందే నీట మునగడంతో విద్యార్థుల కుటుంబ సభ్యులు, తోటి స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
