నిలోఫర్​లో చిన్నపిల్లలపై నిషేధిత వ్యాక్సిన్ల ప్రయోగం..?

నిలోఫర్​లో చిన్నపిల్లలపై నిషేధిత వ్యాక్సిన్ల ప్రయోగం..?
  • పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ ..!
  • రెండు కంపెనీలతో ఓ డాక్టర్​ చేతులు కలిపారని ఆరోపణ
  • విచారణకుఆదేశించిన డీఎంఈ
  • అనుమతులు తీసుకునే చేస్తున్నానన్న డాక్టర్

పిల్లల ఆస్పత్రి నిలోఫర్​లో క్లినికల్​ ట్రయల్స్​ జరుగుతున్నాయి. పిల్లలపై నిషేధించిన వ్యాక్సిన్లను ప్రయోగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా హాస్పిటల్​లో పనిచేసే డాక్టర్లే దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. పీడియాట్రిక్స్​ విభాగంలోని ఓ సీనియర్​ డాక్టర్​, రెండు ఫార్మా కంపెనీలతో కలిసి గుట్టుగా క్లినికల్​ ట్రయల్స్​ చేస్తున్నట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలియో రాకుండా వేసే ఇనాక్టివేటెడ్​ పోలియో వ్యాక్సిన్​ (ఐపీవీ), స్వైన్​ఫ్లూ, రోటా, హెచ్​పీవీ, ఎంఆర్​ వ్యాక్సిన్లను పిల్లలపై ట్రయల్​ చేస్తున్నట్టు ఆరోపించారు. తల్లిదండ్రులకు తెలియకుండా రక్త నమూనాల తీసుకుని రహస్యంగా టెస్టులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మెడికల్​ ఎడ్యుకేషన్​ డైరెక్టర్​, డాక్టర్​ రమేశ్​రెడ్డితో పాటు మరికొంతమంది డాక్టర్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఐపీవీని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిందని డాక్టర్లు చెబుతున్నారు. దాన్ని పిల్లలపై ప్రయోగిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఆ రెండు కంపెనీలకు చెందిన ఇద్దరు అమ్మాయిలను తన అసిస్టెంట్లుగా ఆ డాక్టర్​ నియమించుకున్నారని, ట్రయల్స్​కు సంబంధించిన వివరాలను వాళ్లు నోట్​ చేసి కంపెనీకి పంపిస్తున్నారని సీనియర్​ డాక్టర్​ ఒకరు చెప్పారు. అయితే, సూపరింటెండెంట్​కు తెలియకుండా ఆ ఇద్దరు అమ్మాయిలు హాస్పిటల్​లో ఎలా పని చేస్తున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై డీఎంఈ రమేశ్​రెడ్డి విచారణకు ఆదేశించారు. గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్​ చూసిన రోగుల వివరాలు, కేస్​ షీట్లను సమర్పించాల్సిందిగా హాస్పిటల్​ సూపరింటెండెంట్​ను ఆదేశించారు. క్లినికల్​ ట్రయల్స్​ విరాలను రెండ్రోజుల్లోగా తనకు పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అనుమతులు తీసుకునే చేస్తున్నా..

రోటా, ఎంఆర్​ సహా మరో రెండు వ్యాక్సిన్లపై కొంత మంది డాక్టర్లతో కలిసి తాను క్లినికల్​ ట్రయల్స్​ చేస్తున్న మాట నిజమేనని ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్​ ‘వెలుగు’తో చెప్పారు. అయితే, ట్రయల్స్​కు అన్ని అనుమతులూ తీసుకున్నానని ఆయన చెప్పారు. ఆస్పత్రి ఎథికల్​ కమిటీ ఇచ్చిన అనుమతి పత్రాలూ తన దగ్గర ఉన్నాయన్నారు. అన్ని తెలిసీ కొందరు డాక్టర్లు తనపై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అయితే, క్లినికల్​ ట్రయల్స్​ చేయడానికి ముందు డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ) అనుమతి తీసుకోవాలి. తర్వాత హాస్పిటల్​ ఎథికల్​ కమిటీలో చర్చించి, అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఏ వ్యక్తిపై ట్రయల్​ చేస్తున్నామో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు ముందే తెలియజేయాలి. ఆ వ్యక్తిని కౌన్సిలింగ్​ చేస్తున్నప్పుడు వీడియోనూ రికార్డ్​ చేయాలన్న నిబంధనలూ ఉన్నాయి. ట్రయల్స్​ పద్ధతులను క్లినికల్​ ట్రయల్స్​ ఇండియా అనే సంస్థకు తెలియజేయాల్సి ఉంటుంది. అవేవీ లేకుండానే నిలోఫర్​లో ట్రయల్స్​ జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.