9, 10వ షెడ్యూల్​లో ఉన్న సంస్థల పంచాయతీ తెగుతలే

9, 10వ షెడ్యూల్​లో ఉన్న సంస్థల పంచాయతీ తెగుతలే

గత బీఆర్ఎస్​ సర్కారు నిర్లక్ష్యంతోనే ఇప్పటివరకూ 9,10వ షెడ్యూల్​లో ఉన్న సంస్థల పంచాయతీ తెగుతలేదు. సింగరేణి కాలరీస్ విభజనతో పాటు దానికి అనుబంధంగా ఏపీలో ఉన్న హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (అప్మెల్), చట్టంలో లేకపోయినా రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న కొన్ని సంస్థల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విడుదలైన నిధులను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం, ఖర్చు లెక్క తేల్చడం,  తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ బకాయిలు, చెల్లింపులు, వడ్డీ తదితరాలపై లెక్క సెట్​ కావడం లేదు.  విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్​లోని మొత్తం 91 సంస్థల్లో  షీలా భిడే కమిటీ 68 సంస్థలకు చెందిన ఆస్తులను మాత్రమే పంచింది.  రాష్ట్రం ఏకీభవించని మిగతా సంస్థల విభజనపై  షీలా భిడే కమిటీ రూపొందించిన సిఫార్సులను తెలంగాణ వ్యతిరేకిస్తున్నది. ఏపీ కూడా ఆ సిఫార్సులను అంగీకరించలేదు. అయితే ఈ  సంస్థలకు సంబంధించిన ఆస్తులే 89 శాతం ఉన్నాయి.  

విభజన చట్టంలోని ఏ షెడ్యూల్​లోనూ లేకుండా మరో 32 సంస్థలున్నాయి. వాటిని రెండు రాష్ట్రాలు పంచుకోవడం ఇబ్బందికరంగా మారింది.  తొమ్మిదో షెడ్యూల్​లో ఏపీ వేసిన రెండు కేసుల కారణంగా విభజన అసంపూర్తిగా మిగిలిపోయింది. డెక్కన్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్)కు కేటాయించిన 5 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి  తీసుకుంది. ఆ జీవోపై ఏపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ వేసి, స్టే ఆర్డర్ తెచ్చుకున్నది.  ఏపీ స్టేట్ ఫైనాన్స్​ కార్పొరేషన్ విషయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు కార్పొరేషన్‌‌‌‌కు కేటాయించిన 250 ఎకరాలను తిరిగి తీసుకోవాలనుకుంటే.. దానిని కూడా వ్యతిరేకిస్తూ ఏపీ సర్కారు కోర్టులో స్టే తీసుకుంది. ఇప్పటికీ స్టేట్​ఫైనాన్స్​ కార్పొరేషన్​ విభజన జరగకపోవడంతో.. అక్కడ మొత్తం ఏపీ అధికారుల పెత్తనమే నడుస్తోంది. ఇక పదో షెడ్యూల్​లో ఉన్న ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కు సుప్రీం కోర్టు జారీ చేసిన ఆర్డర్స్ ప్రకారం 2017లో కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను మిగిలిన అన్ని సంస్థలకు వర్తింపజేయాల్సి ఉండగా.. దీనిపైనా రిట్​ పిటిషన్​ దాఖలైంది.  తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్​ ఓపెన్​ వర్సిటీ, తెలుగు అకాడమీ, జేఎన్​యూ ఫైన్​ ఆర్ట్స్​ యూనివర్సిటీ విభజన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.