V6 News

జ్ఞాన సూర్యుడికి కోటి దండాలు..హైదరాబాద్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

జ్ఞాన సూర్యుడికి కోటి దండాలు..హైదరాబాద్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

సిటీ నెట్ వర్క్, వెలుగు:  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ట్యాంక్​బండ్ వద్ద ఉన్న 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహం వద్ద రాజకీయ నేతలు, విద్యార్థి, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. మేడ్చల్​లో ఏఐసీసీ రాష్ట్ర ఇన్​చార్జీ మీనాక్షి నటరాజన్ పాల్గొని, మహిళలకు ఆస్తి హక్కు, సమానత్వం కల్పించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. సికింద్రాబాద్ బన్సీలాల్​పేటలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, పీసీసీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ కోట నీలిమ పాల్గొన్నారు. 

వికారాబాద్​లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి, జూబ్లీహిల్స్​లో ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, తార్నాకలో మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి, ఉప్పల్​లో మందుముల పరమేశ్వర్ రెడ్డి, మల్కాజిగిరిలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, తాండూరులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చేవెళ్లలో ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు బాబాసాహెబ్ విగ్రహాలకు నివాళులర్పించి కేక్ కట్ చేశారు.

ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో వేడుకలు

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఎంఎంసీలో కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి, సీఎంసీలో కమిషనర్ సృజన, హైడ్రా కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ సుదర్శన్ అంబేద్కర్​కు నివాళులర్పించారు. నిమ్స్ ఆసుపత్రిలో డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప, బాగ్ లింగంపల్లి అంబేద్కర్ కాలేజీలో సీఈఓ ప్రొఫెసర్ లింబాద్రి, మల్కాజిగిరి జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి వి. బాలభాస్కర్ రావు బాబాసాహెబ్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్​లో డీసీపీ ఇందిరా, వికారాబాద్‌‌‌‌లో కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

సామాజిక సేవా కార్యక్రమాలు

దిల్​సుఖ్​నగర్​లో ఐక్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. మల్కాజిగిరిలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 50 మంది పేద పిల్లలకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. లంగర్ హౌస్​లో పారిశుధ్య కార్మికులకు షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. తాండూరులో జై భారత్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ..  గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలు మూసివేసినట్లే, అంబేడ్కర్ జయంతి రోజున కూడా రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులు, బార్లను మూసివేయాలని కోరారు.