- 2025- 26లో 4 లక్షలకు పైగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్
- సర్కారు ఖజానాకు రూ. 9 వేల కోట్ల రాబడి
- రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఆదాయంలో 65 శాతం ఇక్కడి నుంచే
హైదరాబాద్, వెలుగు: మౌలిక వసతులు, రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) ప్రస్తుతం రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగానికి గ్రోత్ ఇంజిన్‌లా మారింది. రాజధాని నగరం నలువైపులా విస్తరిస్తున్న వ్యాపార, పారిశ్రామిక, ఐటీ కార్యకలాపాల నేపథ్యంలో ఓఆర్‌ఆర్ చుట్టూ భూములు, నివాస గృహాలు, వాణిజ్య సముదాయాల కొనుగోళ్లు, విక్రయాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖకు సమకూరే రాబడిలో సింహభాగం ఓఆర్‌ఆర్, దాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచే వస్తుండడం ఇక్కడి భూముల డిమాండ్‌ను వెల్లడిస్తున్నది. గడిచిన 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఏకంగా 4.11 లక్షలకు పైగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ద్వారా రూ. 9,500 కోట్లకు పైగా ఆదాయం ఖజానాకు సమకూరింది. ఓఆర్‌ఆర్ మార్గంలో కనెక్టివిటీ అద్భుతంగా ఉండడం, విల్లాలు, హైరైజ్ అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ ప్రాజెక్టులకు భారీగా అనుమతులు లభిస్తుండటంతో స్థానిక కొనుగోలుదారులతోపాటు ఇతర ప్రాంతాలు, దేశ విదేశాల పెట్టుబడిదారులు సైతం ఈ కారిడార్‌పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
ఔటర్ లోపల, బయట పోటాపోటీ..
గణాంకాలను పరిశీలిస్తే ఓఆర్‌ఆర్ లోపల ఉన్న 25 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల (ఎస్‌ఆర్‌ఓల) పరిధిలో మొత్తం 2,22,348 డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా, రూ. 5,219 కోట్ల ఆదాయం లభించింది.రాష్ట్రంలో నమోదైన మొత్తం డాక్యుమెంట్లలో ఇది 13 శాతం కాగా, మొత్తం రాబడిలో ఏకంగా 34 శాతం వాటాను కైవసం చేసుకున్నది. అటు ఓఆర్‌ఆర్‌ను అనుకొని ఉన్న 10 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల పరిధిలో 1,89,639 డాక్యుమెంట్లు నమోదు కాగా, రూ. 4,281 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది మొత్తం డాక్యుమెంట్లలో 11 శాతం, మొత్తం ఆదాయంలో 28 శాతం వాటా కావడం విశేషం. ఈ రెండింటిని కలిపి చూస్తే ఓఆర్‌ఆర్ ప్రభావిత ప్రాంతాల నుంచి 4,11,987 డాక్యుమెంట్ల ద్వారా రూ. 9,500 కోట్ల భారీ ఆదాయం సమకూరినట్లయింది. అంటే రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన మొత్తం రూ. 15,280 కోట్ల రాబడిలో ఇది దాదాపు 65 శాతం కావడం ఇక్కడి రియల్‌బూమ్‌కు అద్దంపడుతున్నది.
కలిసి వస్తున్న ప్రభుత్వ ప్రణాళికలు..
ఓఆర్ఆర్ చుట్టూ విస్తరిస్తున్న పట్టణీకరణ, ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ రంగాలు ఓఆర్‌ఆర్ పరిసరాల్లోనే కేంద్రీకృతం కావడం వల్ల ఇక్కడి భూముల విలువ స్థిరమైన వృద్ధి కనబరుస్తోందని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. గాంధీపేట్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, పటాన్‌చెరు, రాజేంద్రనగర్, ఉప్పల్, కూకట్‌పల్లిలాంటి ప్రధాన ప్రాంతాల్లో భూముల రేట్లు ఎక్కువగా ఉన్నందున డాక్యుమెంట్లు కాస్త తక్కువే నమోదైనా ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం లభిస్తోంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే ఓఆర్‌ఆర్ లోపల ఉన్న ప్రతి చదరపు గజం లేదా ఫ్లాట్ అధిక విలువ కలిగి ఉండడమే రాబడిలో భారీ వ్యత్యాసానికి ప్రధాన కారణమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులో ఓఆర్‌ఆర్ కారిడార్ చుట్టూ మౌలిక వసతులు మరింత విస్తరించనుండటంతో పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. రేడియల్ రోడ్ల అనుసంధానం, మెట్రో విస్తరణ ప్రాజెక్టులు, శాటిలైట్ టౌన్‌షిప్‌ల రూపకల్పనలాంటి ప్రణాళికలు ఓఆర్‌ఆర్ పరిసర ప్రాంతాలకు అదనపు ఆకర్షణగా మారాయి. నగరవాసుల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులు కూడా ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు పెరగడానికి కారణమవుతున్నాయి. కాంక్రీట్ వనంగా మారిన ప్రధాన నగరంలో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం, వాహనాల రొద, ట్రాఫిక్ రద్దీ నుంచి ఉపశమనం పొందేందుకు అనేకమంది నగరం ఆవల , ప్రకృతికి దగ్గరగా నివసించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రోజువారీ పని ఒత్తిడి తర్వాత ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి లభించే గేటెడ్ కమ్యూనిటీలు, ఓపెన్ ప్లాట్లతో కూడిన ఇండిపెండెంట్ ఇండ్లు, విల్లాల వైపు ఐటీ నిపుణులు, ఎగువ మధ్యతరగతి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. పశ్చిమ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, కోకాపేట, తెల్లాపూర్, నార్సింగి పరిసరాల్లో మొదలైన హైరైజ్ నిర్మాణాలు ఇప్పుడు తూర్పు, ఉత్తర ప్రాంతాలైన ఘట్‌కేసర్, శామీర్‌పేట్, మేడ్చల్ వైపు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం పుంజుకుంటే ఓఆర్‌ఆర్, -ట్రిపుల్‌ఆర్ మధ్య ఉన్న భూములకు డిమాండ్ మరింత పెరిగి, నమోదు డాక్యుమెంట్లు రాబడి శాతంలో సరికొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు భావిస్తున్నారు.
ట్రిపుల్‌ఆర్ చుట్టూ పెరుగుతున్న డిమాండ్..
గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్‌ఆర్) ప్రాంతాల వైపు కూడా క్రమంగా రియల్ ఎస్టేట్ లావాదేవీలు విస్తరిస్తున్నాయి. ఓఆర్‌ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య ఉన్న ప్రాంతాల్లోని 4 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 36,511 డాక్యుమెంట్లు నమోదు కాగా, రూ. 266 కోట్ల రాబడి (2 శాతం) లభించింది. ట్రిపుల్ ఆర్‌కు ఇరువైపులా ఉన్న 13 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ద్వారా 1,04,980 డాక్యు మెంట్లు రిజిస్టర్ అయి రూ. 666 కోట్ల ఆదాయం లభించింది. అలాగే ట్రిపుల్ ఆర్ వెలుపల ఉన్న 92 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 6,01,085 డాక్యుమెంట్లు నమోదైనప్పటికీ, రాబడి మాత్రం రూ. 1,827 కోట్లు మాత్రమే ఉంది. నాన్- అగ్రికల్చర్ విభాగంలోని మొత్తం 144 ఎస్‌ఆర్‌ల పరిధిలో సబ్ టోటల్‌గా 11,45,563 డాక్యుమెంట్ల ద్వారా రూ. 12,245 కోట్ల ఆదాయం రాగా, వ్యవసాయ భూముల విభాగంలో 5,73,584 డాక్యుమెంట్ల ద్వారా రూ. 1,457 కోట్లు (10 శాతం) సమకూరాయి. ఇవి కాకుండా నాన్ -రిజిస్ట్రేషన్ ద్వారా మరో రూ. 1,564 కోట్ల రాబడి దక్కింది. రాష్ట్రవ్యాప్తంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాలు కలిపి మొత్తం 17,28,147 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరగ్గా, ప్రభుత్వం మొత్తంగా రూ. 15,280 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం విశేషం.
