- హైదరాబాద్ ఎలా వస్తావ్ అంటున్నరు.. మీరెవరు నన్ను బెదిరించడానికి?: పవన్ కల్యాణ్
- దేశంలోని అన్ని రాష్ట్రాలకు అందరూ వెళ్లొచ్చు.. భారత్‌లో తెలంగాణ అంతర్భాగమే
- ఇదేమన్నా పాలస్తీనానా? పాకిస్తానా?
- నా ఇంటి అడ్రస్ ఇదే.. రండి.. దమ్ముంటే దాడి చేయండి చూద్దాం
- తెలంగాణ కంటే ఏపీలోనే నాకు బెదిరింపులెక్కువ
- నేను తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు..విభజన చేసిన తీరుకే వ్యతిరేకం
- చెరువును కబ్జా చేసినట్టు నిరూపిస్తే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని వెల్లడి
- జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ప్రెస్‌మీట్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో అడుగు పెడతానంటే ‘ఎలా వస్తావ్’ అంటూ కొందరు తనను బెదిరిస్తున్నారని జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు అందరూ వెళ్లొచ్చని, కానీ తనను మాత్రం తెలంగాణకు రావొద్దని చెప్పడం సరైంది కాదని అన్నారు. భవిష్యత్తులో గుజరాత్, మహారాష్ట్రలో ఉన్న తెలంగాణ ప్రజలను కూడా వాళ్లు వెళ్లిపోవాలని అంటే.. వారి పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. ‘‘మీరెవరయ్యా నన్ను బెదిరించడానికి? తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?’’ అని మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ‘‘నా ఇంటి అడ్రస్ ఇదే.. చేతనైతే రండి, దాడి చేయండి చూద్దాం’’ అంటూ సవాల్ విసిరారు. గతంలో ఏపీలో వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా తనను ఇలాగే బెదిరించారని గుర్తు చేశారు. భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమేనని, తెలంగాణ ఏమన్నా పాకిస్తానా? లేదా పాలస్తీనానా? అని ప్రశ్నించారు. తాను తెలంగాణకు రానివ్వొద్దని అనుకుంటే అసెంబ్లీలో తీర్మానం చేయాలని సవాల్ విసిరారు.
గతంలో ఏపీలో వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా తనను ఇలాగే బెదిరించారని గుర్తు చేశారు. భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమేనని, తెలంగాణ ఏమన్నా పాకిస్తానా? లేదా పాలస్తీనానా? అని ప్రశ్నించారు. తనను తెలంగాణకు రావొద్దని అనుకుంటే అసెంబ్లీలో తీర్మానం చేయాలని సవాల్ విసిరారు.
తెలంగాణపై ప్రేమ లేకుంటే కొండగట్టుకు రూ.35 కోట్లు ఎందుకిప్పిస్త?
హైదరాబాద్‌లో 2 వేల మందితో పార్టీ సమావేశం పెట్టుకోవాలంటే అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదు? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి లేదా కేసీఆర్ ఉన్నారని తాను అనుకోవడం లేదని అన్నారు. తెలంగాణపై తనకు ప్రేమ లేకపోతే కొండగట్టు ఆలయానికి టీటీడీ నుంచి రూ.35 కోట్లు ఎందుకు ఇప్పిస్తాను? అని అడిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ గురించి ఎవరూ మాట్లాడలేదని, ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారని అన్నారు. గాంధీ భవన్ సమీపంలోని భీంరావ్ బాడా ఘటనలో తనపై కేసు నమోదైందని గుర్తు చేశారు. కేసీఆర్ ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తే తాము స్వాగతించామని, తమ పార్టీకి చెందిన ఓ నాయకుడే ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేశారని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
విభజనకు కాదు.. విభజన చేసిన తీరుకు వ్యతిరేకం
తెలంగాణలో లక్షలాది మంది జనసైనికులు ఉన్నారని, జనసేన తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడుతోంది? అని ప్రశ్నించడం సరైంది కాదని పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీని హైదరాబాద్‌లోనే స్థాపించామని, తెలంగాణపై తనకు అభిమానముందని చెప్పారు. ‘‘నేను తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు. విభజన చేసిన తీరుకే వ్యతిరేకం. తెలంగాణ ఏర్పాటయ్యే సమయంలో 11 రోజులు అన్నం తినలేదని నేను చెప్పింది విభజన విధానంపై. పార్లమెంట్‌లో తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించారు’’ అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటును సీపీఎం, ఎంఐఎం కూడా వ్యతిరేకించాయని, ఆ పార్టీలను ప్రశ్నించకుండా జనసేననే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని అడిగారు. ‘‘మీరు బెదిరిస్తే భయపడతామా? భయపడేవాళ్లమైతే పార్టీ ఎందుకు పెడతాం? చనిపోవడానికి సిద్ధపడే పార్టీ పెట్టాను. మీరు ఎంత భయపెట్టినా మా గుండె మరింత గట్టిపడుతుంది’’ అని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది..
తెలంగాణలో జనసేన అడుగు పెట్టొద్దని కొందరు అంటున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ‘‘పవన్ కల్యాణ్ తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతాడా? ఏపీలోనే దిక్కులేదు, ఇక్కడ ఏమవుతాం? ఇప్పటి వరకు నేను ఆలోచించలేదు. కానీ ఇప్పుడు స్పష్టంగా చెబుతున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది. నిరుద్యోగం, అభివృద్ధి సహా అన్ని అంశాలపై మాట్లాడుతుంది’’ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఏపీ ప్రజలపై లేదా ఏపీ నాయకులపై వివక్ష లేదని, 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ నాయకులను తాను వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. ‘‘నా పీక కోసినా భయపడను. నన్ను ఎన్ని తిట్టినా పట్టించుకోను. రెచ్చగొట్టడం నాకు ఇష్టం లేదు’’ అని స్పష్టం చేశారు. తెలంగాణకు వలసలు తగ్గాలంటే ఏపీలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరగాలని, అందుకోసం కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజల ఐక్యతకు బూర్గుల రామకృష్ణారావు ప్రతీక అని, ఆయన విగ్రహాన్ని ఏపీ–తెలంగాణ హైవేపై ఏర్పాటు చేయడంతోపాటు ఆ రహదారికి ఆయన పేరు పెట్టాలని సూచించారు.
ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు
ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన భేటీపై ఓ రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారని పవన్ కల్యాణ్ అన్నారు. ఆ విశ్లేషకుడిపై తనకు గౌరవం ఉన్నప్పటికీ, వివాదం ముగిసిన తర్వాత కూడా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడారని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరిపై కూడా తనకు గౌరవం ఉందని, ఆయనతో ఎన్నోసార్లు చర్చలు జరిపానని చెప్పారు. అయినప్పటికీ ఆయన కూడా తనను విమర్శిస్తున్నారని అన్నారు. ‘‘తెలంగాణలో సమస్యలు ఉంటే వాటికి ఏపీ నాయకులు, పవన్ కల్యాణ్ కారణమా? ఆంధ్రా వాళ్లను తిడుతుంటే వాళ్లు ఇక్కడ ఎలా ఉంటారు? ఇంకా ఎంతకాలం ఆంధ్రా వాళ్లను తిడుతూ కాలక్షేపం చేస్తారు?’’ అని ప్రశ్నించారు.
చెరువు కబ్జా చేశానని నిరూపిస్తే ప్రభుత్వానికే రాసిస్తా
హైదరాబాద్‌లో తాను చెరువు కబ్జా చేశానంటూ ఆరోపణలు వస్తున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. ‘‘నేను చెరువు కబ్జా చేసినట్టు నిరూపిస్తే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తా. నాకు ఫామ్‌హౌస్ ఉంది. అక్కడ గోశాల ఉంది. అందులో 60–70 గోవులు ఉన్నాయి’’ అని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 111 జీవో పరిధిలో జరిగిన అక్రమాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డిపై తనకు గౌరవం ఉందన్నారు.
గద్దర్‌కు వెహికల్ కొనిచ్చా
ప్రజాగాయకుడు గద్దర్‌పై తనకు చిన్నప్పటి నుంచే అభిమానముందని పవన్ కల్యాణ్ చెప్పారు. ‘‘గద్దర్ నన్ను అరేయ్ అని పిలిచేంత చనువు ఉండేది. ఒకసారి నా ఇంటికి వచ్చి, ఒంట్లో బుల్లెట్ ఉండటంతో ఆటోలో తిరగలేకపోతున్నానని చెప్పారు. రెండు రోజుల్లోనే ఆయనకు వెహికల్ కొనిచ్చాను’’ అని తెలిపారు. గద్దర్‌పై కాల్పులు జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదని రాజకీయ పార్టీలను ప్రశ్నించారు. గద్దర్ తమ పార్టీ కార్యాలయానికి వచ్చేవారని, ఆయన బతికున్నప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నవాళ్లు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. ఏపీలో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేస్తారా? అని మీడియా అడగ్గా.. దాని కోసం కృషి చేస్తానని చెప్పారు. ‘‘తెలంగాణను అడ్డుకున్నవాళ్లే ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్నారు. దాసోజు శ్రవణ్ మా పార్టీలో పనిచేసిన నాయకుడు కాదా? పీవీ నరసింహారావును నంద్యాల ప్రజలు ఎంపీగా గెలిపించారు. ఇందిరా గాంధీని మెదక్ ప్రజలు గెలిపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేరళలో పోటీ చేయొచ్చు. నేను తెలంగాణకు రావొద్దా? 2014లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఎన్డీయే కోరినా నేను అంగీకరించలేదు. ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ తీసుకోవాలా?’’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
