సెన్సస్ మస్కట్స్ ఆవిష్కరించిన అమిత్ షా..నాలుగు డిజిటల్ సాధనాలను లాంచ్ చేసిన కేంద్రం

సెన్సస్ మస్కట్స్ ఆవిష్కరించిన అమిత్ షా..నాలుగు డిజిటల్ సాధనాలను లాంచ్ చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: జనగణన (సెన్సస్) ప్రక్రియకు సంబంధించి కేంద్రం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు గురువారం సెన్సస్ 2027కు సంబంధించి నాలుగు డిజిటల్ సాధనాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంచ్ చేశారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని ప్రతిబింబించేలా మస్కట్స్ ప్రగతి, వికాస్‌‌‌‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ రెండు మస్కట్స్ మహిళా, పురుషులను తెలియజేస్తయని ప్రభుత్వం తెలిపింది.

2047 నాటికి భారత్‌‌‌‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో పురుషులు, మహిళల సమాన భాగస్వామ్యాన్ని ఈ మస్కట్‌‌‌‌లు ప్రతిబింబిస్తాయని చెప్పింది. జనగణన ప్రక్రియను  సులభతరం చేసేందుకు ‘సెంటర్ ఫర్ డెవలప్‌‌‌‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌‌‌‌డ్ కంప్యూటింగ్’ (సీడాక్) ఈ సరికొత్త డిజిటల్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లను అభివృద్ధి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద జనగణన ప్రక్రియగా ఇది నిలవనుంది.

దేశ చరిత్రలోనే మొదటిసారిగా దీన్ని పూర్తిస్థాయిలో డిజిటల్ పద్ధతిలో నిర్వహించనున్నారు. పెన్ను, పేపర్‌‌‌‌‌‌‌‌కు స్వస్తి పలకనున్నారు. రెండు దశల్లో దీన్ని పూర్తి చేయనున్నారు. 2026, ఏప్రిల్ 1 నుంచి జనగణన ప్రక్రియ మొదలవుతుంది. మొదటి దశలో ఏప్రిల్ నుంచి -సెప్టెంబర్ 2026 వరకు ఇండ్ల జాబితా, ఇండ్ల గణన చేపడతారు. రెండో దశలో 2027, ఫిబ్రవరి నుంచి జనాభా లెక్కింపు జరుగుతుంది. 

స్వయంగా వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు

రాబోయే జనగణనలో వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. అధికారిక సిబ్బంది తమ ఇంటికీ రాకముందే పౌరులు తమ వివరాలను ఆన్‌‌‌‌లైన్ ద్వారా16 భాషల్లో స్వయంగా నమోదు చేసుకునే సదుపాయం కల్పించారు. జనగణన ప్రక్రియను పర్యవేక్షించడానికి ‘సెన్సస్ మేనేజ్‌‌‌‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’ అనే పోర్టల్‌‌‌‌ను కేంద్రం సిద్ధం చేసింది.

 సుమారు 32 లక్షల మంది ఎన్యూమరేటర్లు ట్యాబ్లెట్లు, జియో ట్యాగింగ్ వంటి టెక్నాలజీతో వివరాలు సేకరిస్తారు. దీనివల్ల డేటా సేకరణలో తప్పులు తగ్గుతాయని, గణాంకాలు వేగంగా విశ్లేషించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.