హైదరాబాద్ లో ఓ మహిళా ఖైదీ సినిమా ఫక్కీలో పరారైంది. పేట్లబుర్జులోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి నుంచి విచారణ ఖైదీ త్రివేణి తప్పించుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే.. ఆన్‌లైన్ చీటింగ్, చోరీ కేసుల్లో నిందితురాలిగా ఉన్న త్రివేణిని పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే వైద్య పరీక్షల నిమిత్తం మంగళవారం ఆమెను చంచల్‌గూడ జైలు నుండి పేట్లబుర్జు ఆస్పత్రికి తీసుకువచ్చారు.
ఆస్పత్రిలో ఉండగా వాష్‌రూమ్‌కు వెళ్తానని చెప్పి పోలీసులను నమ్మించిన త్రివేణి.. అక్కడ వారి కళ్లుగప్పి క్షణాల్లో మాయమైంది. రక్షణగా ఉన్న సిబ్బంది తేరుకునేలోపే ఆమె ఆస్పత్రి పరిసరాల నుండి పరారైంది.ఈ ఘటనపై హుస్సేని ఆలం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, తప్పించుకున్న ఖైదీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. పోలీసుల పహారాలో ఉండగానే ఖైదీ తప్పించుకోవడంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

