ఇటీవల ప్రకటించిన 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడం పట్ల చిత్ర నిర్మాత ఫణి అడపాక ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంతో పాటు ఉత్తమ మేకప్ విభాగంలో జాతీయ అవార్డులు అందుకోవడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమని ఆయన అన్నారు.
ఇది తన జీవితంలో ఎప్పటికీ మరువలేని ఘట్టమని తెలియజేశారు. ఒక నిర్మాతగా ఇంతటి గౌరవం దక్కడం ఎంతో ఆనందాన్ని, అదే సమయంలో మరింత బాధ్యతను కలిగిస్తోందని, ‘ఈ గుర్తింపు ఒక్కరి విజయం కాదు.. ‘కమిటీ కుర్రోళ్లు’ కోసం అంకితభావంతో శ్రమించిన ప్రతి ఒక్కరి కృషికి దక్కిన గౌరవం’ అని అన్నారు. అలాగే ఈ ప్రయాణంలో అడుగడుగునా తోడుగా నిలిచిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, నిహారికకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.
