నా కొడుకు బీజేపీలో చేరడం నన్ను బాధించింది: ఏకే ఆంటోని

నా కొడుకు బీజేపీలో చేరడం నన్ను బాధించింది: ఏకే ఆంటోని

తన కొడుకు అనిల్ ఆంటోని బీజేపీలో చేరడం చాలా బాధ కల్గించిందన్నారు కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోని. బీజేపీలో చేరాలని అనిల్ తీసుకున్న నిర్ణయం బాధాకరమని.. ఇది చాలా తప్పుడు నిర్ణయం అన్నారు.

బీజేపీ,  ఆర్‌ఎస్‌ఎస్‌లను తాను ఎప్పుడూ వ్యతిరేకించాననని.. తన చివరి శ్వాస వరకు అలానే ఉంటానని స్పష్టం చేశారు ఏకే ఆంటోని. తాను కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ-గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్నానని, భారతదేశాన్ని ఏకతాటిపై ఉంచడంతోపాటు భిన్నత్వాన్ని గౌరవించిన ఘనత తమదేనన్నారు. తాను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించిన ఇందిరాగాంధీ నుంచి తాను స్ఫూర్తి పొందానని చెప్పారు.  విధానపరమైన విషయంలో ఒక్కసారి ఆమెతో విభేదించానని..  ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి వచ్చి ఆమెను మరింత గౌరవించానని చెప్పారు. తాను రాజకీయ జీవితంలో చివరి దశలో ఉన్నానన్నారు ఏకే ఆంటోని.  ఎంత కాలం బతుకుతానో తెలియదు కానీ తాను ఉన్నంత కాలం  కాంగ్రెస్ కోసం బతుకుతానని తెలిపారు. 

బీజేపీలో చేరిన ఆంటోని కుమారుడు

కేంద్ర మాజీ మంత్రి ఎకే. ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ బీజేపీ కండువా కప్పుకున్నారు.  గురువారం కేంద్ర మంత్రి పియూష్ గోయల్, వీ. మురళీధరన్ సమక్షంలో బీజేపీలో చేరారు.  బీజీపీ కండువా కప్పుకున్న తర్వాత మాట్లాడిన అనిల్ ఆంటోనీ .. ‘చాలామంది కాంగ్రెస్ నాయకులు తమ కర్తవ్య మరిచి ఒక కుటుంబం కోసం పని చేస్తున్నారు. ప్రజల కోసం పని చేయడమే నా కర్తవ్యం. బీజేపీ ఒక విజన్ తో ఉన్న పార్టీ. మోడీ ఆ విజన్ కోసం పనిచేస్తున్నారు. రాబోయే 25 ఏళ్లలో భారత్ అభివద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని’ అన్నారు.