- వరుస ప్రమాదాలపై అనుమానాలు
జీడిమెట్ల, వెలుగు: ప్రగతినగర్ కమాన్ వద్ద రోడ్డు పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో సోమవారం అర్ధరాత్రి మళ్లీ భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక దుకాణంలో మొదలైన మంటలు శరవేగంగా పక్కనే ఉన్న షాపులకు వ్యాపించడంతో సుమారు 9 దుకాణాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
నెల రోజుల్లో రెండోసారి..
సరిగ్గా నెల రోజుల కింద ఇదే ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగి దుకాణాలు దగ్ధమయ్యాయి. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ప్రమాదం జరగడంపై బాధితులు, స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా కావాలనే ఈ అరాచకానికి పాల్పడుతున్నారా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వరుస ప్రమాదాలతో ఫర్నిచర్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
