కరీంనగర్, వెలుగు : కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ ఘటనలో మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుడు అమర్‌సింగ్ అలియాస్ పహిల్వాన్ అలియాస్ అమరేంద్రసింగ్‌ను ఈ నెల 4న సలీంపూర్‌లో అరెస్ట్ చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. అతడిని ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు.
మరో వైపు పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులు సుభోద్‌సింగ్‌తో పాటు రఘునాథ్ కర్మాకర్, రవీశ్‌కుమార్ పోలీస్ కస్టడీలో ఇచ్చిన సమాచారం మేరకు... వెలిచాల బైపాస్ రోడ్డు వద్ద చెట్ల పొదల్లో దాచిన రెండు పిస్టల్స్, బుగ్గారం అటవీ ప్రాంతం సమీపంలో దాచిన మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆభరణాల సమాచారం, రవాణా విషయాలపై నిందితులు పరస్పర విరుద్దమైన, తప్పుదారి పట్టించే వాంగ్మూలాలు ఇచ్చినట్లు సీపీ తెలిపారు.
నిందితుల కస్టడీ ఆదివారంతో ముగిసింది. అయితే నిందితులు దొంగిలించిన సొత్తు ఎక్కడ దాచారు ? ఎవరికి విక్రయించారు ? ఎవరెవరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్లు గుర్తించిన పోలీసులు.. మరింత సమాచారం సేకరించేందుకు మళ్లీ కస్టడీ కోరాలని భావిస్తున్నట్లు తెలిసింది.
