హైదరాబాద్ లో సోమవారం ( జూన్ 22 ) రాత్రి భారీ వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి సిటీలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి.చాలా ఏరియాల్లో కాలనీలు నీట మునిగాయి. చాలా చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు జనం. బీరంగూడలోని నవ్య ప్రైడ్ అపార్ట్మెంట్ లో సెల్లార్ లోకి వర్షపు నీరు చేరింది. సెల్లార్ పూర్తిగా నీటితో నిండిపోవడంతో కార్లు నీటమునిగాయి. లిఫ్ట్ కూడా వర్షపు నీటితో నిండిపోవడంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
అర్థరాత్రి, అంతా నిద్రపోయే సమయంలో ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో సెల్లార్ వర్షపు నీటితో నిండిపోయింది. ఉదయం లేచేసరికి సెల్లార్ మొత్తం నీటితో నిండిపోయిందని అంటున్నారు అపార్ట్మెంట్ వాసులు. సెల్లార్ లో నీటిని మోటార్ సాయంతో బయటికి తోడుతున్నారు. కార్లు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో జేసీబీ సాయంతో బయటికి తీసి రిపేర్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి శేరిలింగంపల్లి, తార నగర్ లో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.
తెలంగాణ వ్యాప్తంగా వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, టెంపరేచర్లు 2 డిగ్రీల నుంచి 5 డిగ్రీల వరకు తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు స్తంభించిపోయినా.. రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, చత్తీస్ గఢ్ మీదుగా తెలంగాణ వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావాలతో వర్షాలు పడుతాయని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఈదురుగాలుల తీవ్రత కూడా ఉంటుందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొంది.
హైదరాబాద్ సిటీ పరిధిలోనూ భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. కాగా, అదే సమయంలో సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
