- ఆయనతోపాటు నలుగురిపై కేసు
గచ్చిబౌలి, వెలుగు: డ్రగ్స్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఏఆర్ కానిస్టేబుల్ స్వయంగా గంజాయి సేవిస్తూ ఈగల్ టీంకు పట్టుబడ్డాడు. ఆయనతో పాటు మరో నలుగురికి పాజిటివ్ రాగా పోలీసులు కేసు నమోదు చేశారు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన ప్రకారం.. కూకట్పల్లికి చెందిన తేజేశ్వర్ రెడ్డి(28), రామంతాపూర్కు చెందిన సాయి ప్రసాద్ రెడ్డి(28), గచ్చిబౌలికి చెందిన రమేశ్(27), మణికొండకు చెందిన మిగేందర్ రెడ్డి హైదరాబాద్లోని ఓ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు.
వీరికి హైదరాబాద్ కమిషనరేట్లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ టి.రవి కామన్ ఫ్రెండ్. గతంలో ఓ పెండ్లి వేడుకల్లో కలిసి మద్యం, డ్రగ్స్ వాడిన వీరు.. జనవరి 6 మంగళవారం కొండాపూర్లోని కోవ్ స్టేస్ హోటల్ రూమ్ 309లో మళ్లీ పార్టీ ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా కానిస్టేబుల్ రవితో సహా ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. న్యూ ఇయర్ వేడుకల్లోనూ గంజాయి తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
