ఇయ్యాల భారత్​ బంద్

ఇయ్యాల భారత్​ బంద్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్​ పథకంపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ స్కీంను వాపస్​ తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ ఆర్మీ అభ్యర్థులు పలు రాష్ట్రాల్లో ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ‘భారత్​ బంద్’కు పిలుపునిచ్చారు. ఇప్పటికే పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరగడంతో కేరళ, హర్యానా, జార్ఖండ్, యూపీ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్​ అయ్యాయి. సెక్యూరిటీ ఏర్పాట్లపై దృష్టిపెట్టాయి.

హర్యానా..

ఫరీదాబాద్ ​సిటీలో అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు అధికారులు చెప్పారు. సంఘ వ్యతిరేక శక్తుల కదలికలను గుర్తించేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో వీడియోగ్రఫీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కేరళలో ఆందోళనల పేరుతో హింసకు పాల్పడుతూ కనిపించిన వాళ్లను అక్కడికక్కడే అరెస్టు చేయాలని ఆ రాష్ట్ర డీజీపీ ఆదేశాలిచ్చారు. దుకాణాలను బలవంతంగా మూసేయించే ప్రయత్నాలను అడ్డుకోవాలని జిల్లా పోలీస్​ బాస్​లకు సూచించారు. జార్ఖండ్‌లో  అన్ని స్కూల్స్​కు సోమవారం సెలవు ప్రకటించినట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి మీడియాకు తెలిపారు.

ఉత్తరప్రదేశ్...

గౌతమ బుద్ధ నగర్​లో ఇప్పటికే అమలులో ఉన్న 144 సెక్షన్​ను పొడిగిస్తున్నట్లు యూపీ పోలీసులు ప్రకటించారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే వారిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేస్తామని హెచ్చరించారు. పంజాబ్​లో భారత్​ బంద్​ సందర్భంగా ఎలాంటి పుకార్లు వ్యాపించకుండా సోషల్​ మీడియా గ్రూపులపై నిఘా పెట్టాలని ​పోలీసులకు అక్కడి ఏడీజీపీ (లా అండ్​ ఆర్డర్) ఆదేశాలు జారీ చేశారు.