మణిపూర్‌‌లో ఆర్మీ చీఫ్.. పరిస్థితిపై గవర్నర్ తో రివ్యూ 

మణిపూర్‌‌లో ఆర్మీ చీఫ్.. పరిస్థితిపై గవర్నర్ తో రివ్యూ 
  • మణిపూర్‌‌లో ఆర్మీ చీఫ్..  పరిస్థితిపై గవర్నర్ తో రివ్యూ 
  •     మళ్లీ హింస నేపథ్యంలో భద్రత పెంపు

ఇంఫాల్: ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే శనివారం మణిపూర్‌‌కు చేరుకున్నారు. హింసాకాండతో అతలాకుతలమైన రాష్ర్టంలో పరిస్థితిపై గవర్నర్ తో రివ్యూ నిర్వహించారు. రెండు రోజులపాటు ఆయన మణిపూర్​లో పర్యటించనున్నారు.  పలు  ప్రదేశాలను సందర్శించనున్నారు. స్థానిక కమాండర్లతో మాట్లాడి పరిస్థితిని స్వయంగా తెలుసుకుంటారు. ఆర్మీ, అస్సాం రైఫిల్స్ దళాలతో కూడా చర్చిస్తారు.  మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికే, ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్, మణిపూర్ ముఖ్య భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్‌‌లతో ఆదివారం ఆర్మీ చీఫ్​ సమావేశమై చర్చించారు. కాగా, మణిపూర్​లో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి కేంద్రం సుమారు పదివేల మంది సైన్యం, పారా మిలటరీ సిబ్బందిని మోహరించింది. తాజా హింసాత్మక ఘటనల మధ్య ఆర్మీ, అస్సాం రైఫిల్స్ భద్రతను పెంచాయి. ఇంఫాల్ ఈస్ట్, చర్చంద్‌‌పూర్‌‌లో రెండు వర్గాల మధ్య కాల్పులను భద్రతా దళాలు అడ్డుకున్నాయి.  కొంతమంది సాయుధ వ్యక్తులు కాల్పులు జరిపి కొండప్రాంతాల్లోకి పారిపోయారని ఆర్మీ తెలిపింది. 

ఐదుగురు మిలిటెంట్లు సరెండర్​

నిషేధిత కంగ్లీపాక్ కమ్యూనిస్ట్​ పార్టీ (కేసీపీ)కి చెందిన ఐదుగురు మిలిటెంట్లు మణిపూర్​లో భద్రతా దళాల ఎదుట లొంగిపోయారు. సోమ్సాయ్, ఉక్రూల్​వద్ద పోలీసులు సమక్షంలో అస్సాం రైఫిల్స్​ఎదుట మిలిటెంట్లు లొంగిపోయినట్లు భద్రతా బలగాలు ఓ ప్రకటనలో తెలిపాయి. కాగా, గత నెలలో 37మంది మిలిటెంట్లు సీఎం ఎన్​ బీరెన్​ సింగ్​ సమక్షంలో ఇంఫాల్​లో ఆయుధాలను అప్పగించి లొంగిపోయారు.  

ముగ్గురు పారా మిలిటరీ సిబ్బంది అరెస్ట్​

ర్యాపిడ్​ యాక్షన్​ ఫోర్స్ (ఆర్ఏఎఫ్)కు  చెందిన ముగ్గురిని మణిపూర్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంఫాల్​లో  అల్లర్లు జరిగిన సమయంలో మాంసం దుకాణానికి నిప్పు పెట్టారన్న ఆరోపణలపై వీరిని అరెస్ట్​ చేశారు. గురువారం రాత్రి స్థానికులు అల్లర్లకు పాల్పడగా ఆ ప్రాంతంలో గస్తీ ఉన్న ఈ ముగ్గురు షాప్ ను తగలబెట్టారని కేసు నమోదైంది. దీంతో వీరు ముగ్గురిని  ఆర్ఏఎఫ్​ సస్పెండ్​ చేసింది.