బోర్డర్ లో ‘టెర్రర్​ ఆర్మీ’

బోర్డర్ లో ‘టెర్రర్​ ఆర్మీ’
  • టెర్రరిస్టులను సరిహద్దు దాటించడమే పని
  • టెర్రరిస్టులకు వెన్నుదన్నుగా పాక్​ బోర్డర్​ యాక్షన్​ టీం 

సరిహద్దులో భారత సైన్యం కదలికలపై కన్నేయడం.. ఎక్కడ? ఎప్పుడు? బోర్డర్​దాటేందుకు వీలవుతుందో పక్కా ప్లాన్ ​చేసుకోవడం.. ఆ తర్వాత గస్తీ కాస్తున్న ఇండియన్​ఆర్మీపైకి కాల్పులు జరపడం.. సందు చూసుకుని ఉగ్రవాదులు సరిహద్దు దాటి ఇండియాలోకి చొరబడటం..  పొరుగుదేశం పాకిస్తాన్​ దశాబ్దాలుగా అనుసరిస్తున్న వ్యూహం ఇది! అయితే, టెర్రరిస్టులను సరిహద్దులు దాటించే కుట్రల వెనక సాక్షాత్తూ ఆ దేశ ఆర్మీయే ప్రధాన పోత్ర పోషిస్తుంటుంది. ఆ యాక్షన్​ ప్లాన్​ మొత్తం అమలు చేసేది పాకిస్తాన్ ​ఆర్మీకి చెందిన బోర్డర్ ​యాక్షన్​టీం (బ్యాట్), స్పెషల్​సర్వీస్​ గ్రూప్​(ఎస్ఎస్​జీ) కమాండోలే. బుధవారం రాత్రి ఇలాంటి ఓ చొరబాటు కుట్రనే దీటుగా తిప్పికొట్టి, ఏడుగురిని మట్టుబెట్టినట్టు ఇండియన్​ ఆర్మీ ప్రకటించింది.

బ్యాట్ ప్లాన్​.. ఎస్ఎస్​జీ ఆచరణ

పాక్​నుంచి టెర్రరిస్టులను పంపే ముందు మొత్తం ప్లాన్​ను  బ్యాట్ సిద్ధం చేస్తుంది. సరిహద్దులో ఎక్కడ చొరబడేందుకు ఈజీగా ఉంటుంది? ఏ సమయంలో భారత సైనికులు ఆ చోటులో ఉండరు? చొరబడిన తర్వాత భారత సైనికుల కన్నుగప్పి ముందుకు వెళ్లడం ఎలా? ఒకవేళ ఇండియన్​ ఆర్మీ  ఎదురుపడితే దాక్కోవడం ఎలా? 778 కిలోమీటర్ల పొడవైన ఎల్ఓసీ వెంబడి ఇలాంటివన్నీ చూసుకుని, ప్లేస్​ ఎంపిక చేసుకున్నాక బ్యాట్​ ఫైనల్​గా ఆపరేషన్​ ప్రారంభిస్తుంది. బ్యాట్​ప్లాన్​అమలు చేసేందుకు ఎస్ఎస్​జీ కమాండోలు రంగంలోకి దిగుతారు. ఒక్కో విడత వీరు ఐదు నుంచి ఏడుగురు మాత్రమే టీంగా బయల్దేరతారు. అనుకున్న ప్లాన్​ప్రకారం, వీరు టెర్రరిస్టులను వెంటేసుకుని చొరబడేందుకు ప్రయత్నిస్తారు. ఒకవేళ ఇండియన్​ సైనికులు ఎదురైతే వీరు కాల్పులు జరుపుతూ, ఉగ్రవాదులను బోర్డర్ ​దాటిస్తారు. టెర్రరిస్టులు ఇండియాలోకి దూరగానే తిరిగి వెనక్కి వెళ్లిపోతారు.

నల్లకొంగలు.. నరహంతక ముఠాలు

ఎస్ఎస్​జీ కమాండోలు నల్లటి దుస్తులు ధరిస్తుంటారు. అందుకే వీరిని నల్ల కొంగలు అని పిలుస్తుంటారు. కార్గిల్​లో 1999లో వీరే ముందుగా బోర్డర్​ దాటొచ్చి సురక్షిత స్థావరాలు ఏర్పాటు చేసుకుని మరీ తిష్ట వేశారు. ఆ తర్వాత పాక్​సైన్యం ప్రవేశించి, కయ్యానికి కాలుదువ్వింది. అయితే, వీరు చొరబాట్లు, కాల్పులు జరపడమే కాదు.. ఇండియన్​ సైనికులు చిక్కితే అతి కిరాతకంగా వ్యవహరిస్తుంటారు కూడా. వీరు 2017 మే నెలలో పూంచ్​ జిల్లాలోని క్రిష్ణా ఘటి సెక్టార్​లో ఇద్దరు భారత సైనికులు బందీలుగా దొరికితే, వారి తలలను నరికివేశారు. ఈ ఆటవిక దుశ్చర్యపై ప్రపంచమంతా దుమ్మెత్తిపోసింది. అంతకుముందు 2013 జనవరిలో లాన్స్​నాయక్​హేమరాజ్, లాన్స్​నాయక్ ​సుధాకర్ ​సింగ్​లు బందీలుగా దొరకడంతో పాక్​ బోర్డర్​ యాక్షన్​ టీం సైనికులు కూడా వారి తలలను నరికివేశారు. ఈ దాడి నుంచి బీఎస్ఎఫ్​ కానిస్టేబుల్ ​రాజీందర్​సింగ్​ గాయాలతో తప్పించుకున్నారు. ఎప్పుడూ టెర్రరిస్టులను బోర్డర్​ దాటించడమే పనిగా పెట్టుకునే బ్యాట్​ గత  రెండేండ్లలో దాదాపుగా ఆరేడు సార్లు చొరబాట్లకు యత్నించిందని ఇండియన్​ ఆర్మీ అధికారులు వెల్లడించారు.  ప్రస్తుతం ఎల్ఓసీ ఆవల 250 మంది వరకూ టెర్రరిస్టులను సరిహద్దులు దాటించేందుకు  సిద్ధంగా ఉంచిందని, కానీ అప్రమత్తంగా ఉండటంతో వారి ఆటలు సాగలేదని చెబుతున్నారు.