
లార్డ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. స్మిత్ (85 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్ (77), వార్నర్ (66) హాఫ్ సెంచరీలతో రాణించడంతో.. బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 339/5 స్కోరు చేసింది. స్మిత్‌తో పాటు అలెక్స్ క్యారీ (11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఖవాజ (17), కామెరూన్ గ్రీన్ (0) ఫెయిలయ్యారు. లబుషేన్ (47) మెరుగ్గా ఆడాడు. ఇంగ్లిష్ బౌలర్లలో జోష్ టంగ్, జో రూట్ చెరో రెండు వికెట్లు తీశారు.
నిరసనకారుడిని ఎత్తిపడేసిన బెయిర్‌స్టో
తొలి సెషన్‌లో సెకండ్ హాఫ్ ప్రారంభానికి ముందు ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ గ్రూప్‌కు చెందిన ఇద్దరు నిరసనకారులు గ్రౌండ్‌లోకి దూసుకొచ్చారు. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది వీళ్లను పట్టుకునేందుకు గ్రౌండ్‌లోకి పరుగెత్తుకొచ్చారు. అప్పటికే నిరసనకారులు పిచ్ సమీపంలో ఆరెంజ్ కలర్ పౌడర్‌ను చల్లారు. అక్కడే ఉన్న ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో ఓ నిరసనకారుడిని అమాంతం ఎత్తుకెళ్లి బౌండ్రీ లైన్ బయటపడేయగా, మరొకర్ని సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తర్వాత గ్రౌండ్ సిబ్బంది కలర్‌ను శుభ్రం చేయడంతో ఆరు నిమిషాల తర్వాత ఆటను తిరిగి కొనసాగించారు.