ఇండోనేషియాలో మరోసారి భారీ భూ భూకంపం వచ్చింది. పశ్చిమజావా ద్వీపంలో సంభవించిన భూప్రకంపనల కారణంగా మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. భూకంపం దాటికి ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 46కు చేరింది. దాదాపు 700ల మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రిక్టర్ స్కేలు పై భూకంప తీవ్రత 6.9 నుంచి 5.6 మధ్య నమోదైంది. భూకంపం కారణంగా వేలాది ఇండ్లు ధ్వంసం అయ్యాయి. పెద్ద పెద్ద భవనాలు కుంగిపోయాయి. భూప్రకంపనలతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. భవనాల శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
