గోల్డెన్ గోల్ డిపాజిట్ స్కీమ్ లాంచ్ చేసిన బ్యాంక్ ఆఫ్ బరోడా.. సూపర్ వడ్డీ రేటు ఆఫర్.. డోన్ట్ మిస్

గోల్డెన్ గోల్ డిపాజిట్ స్కీమ్ లాంచ్ చేసిన బ్యాంక్ ఆఫ్ బరోడా.. సూపర్ వడ్డీ రేటు ఆఫర్.. డోన్ట్ మిస్

High Interest FD: బ్యాంక్ ఆఫ్ బరోడా అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏకంగా 7.40 శాతం వరకు గరిష్ట వడ్డీ రేటును ఆఫర్ చేస్తూ సరికొత్త స్కీమ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో కస్టమర్ల పొదుపు మొత్తానికి ఖచ్చితమైన, అత్యధిక లాభాలను అందించడమే లక్ష్యంగా 'బాబ్ గోల్డెన్ గోల్ డిపాజిట్ స్కీమ్' పేరుతో ఈ సరికొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రొడక్ట్‌ను బ్యాంక్ లాంచ్ చేసింది. సురక్షితమైన పెట్టుబడితో పాటు ఎక్కువ రిటర్న్స్ ఆశించేవారికి ఈ స్కీమ్ ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.

ఈ ప్రత్యేకమైన స్కీమ్ కేవలం 555 రోజుల కాలపరిమితితో అందుబాటులోకి వచ్చింది. రూ.3 కోట్ల కంటే తక్కువ ఉండే రిటైల్ డిపాజిట్లకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ప్రస్తుత మార్కెట్ వడ్డీ రేట్ల వాతావరణంలో కస్టమర్లు తమ డబ్బుపై స్థిరమైన, ఆకర్షణీయమైన ఆదాయాన్ని లాక్ చేసుకోవడానికి ఈ కాలపరిమితి ఎంతగానో ఉపయోగపడుతుందని బ్యాంక్ తెలిపింది. కస్టమర్ల వయస్సు, వారు ఎంచుకునే డిపాజిట్ రకాన్ని బట్టి వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి.

సాధారణ కస్టమర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉన్న డిపాజిట్లను ఎంచుకుంటే వారికి ఏడాదికి 6.75 శాతం వడ్డీ లభిస్తుంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 7.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నారు. ఇక 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సూపర్ సీనియర్ సిటిజన్లు ఈ స్కీమ్ ద్వారా 7.35 శాతం వార్షిక వడ్డీ రేటును అందుకోవచ్చు.

ఒకవేళ మీరు డిపాజిట్ గడువు ముగిసే వరకూ డబ్బు తీసుకోకూడదనే ఆప్షన్‌ను ఎంచుకుంటే వడ్డీ రేట్లు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ కేటగిరీలో సాధారణ కస్టమర్లకు 6.80 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక అత్యధికంగా సూపర్ సీనియర్ సిటిజన్లకు లభించే 7.40 శాతం వడ్డీ రేటు.. ప్రస్తుత బ్యాంకింగ్ రంగంలోనే అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లలో ఒకటిగా నిలిచింది. నాన్-కాల్‌బుల్ డిపాజిట్లలో ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉండదు కాబట్టే బ్యాంకులు వీటికి అదనపు వడ్డీని అందిస్తాయి.

ఈ సరికొత్త స్కీమ్ లాంచ్ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీనా వహీద్ మాట్లాడుతూ.. మారుతున్న వడ్డీ రేట్ల పరిస్థితుల్లో కస్టమర్లు తమ పెట్టుబడులపై అధిక లాభాలను అందుకునేందుకు ఈ స్కీమ్ ఒక అద్భుతమైన అవకాశమని అన్నారు. కస్టమర్లు వారి ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోవడానికి, విలువ ఆధారితమైన మరిన్ని వినూత్న ఉత్పత్తులను అందించేందుకు బ్యాంక్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

ఈ గోల్డెన్ గోల్ డిపాజిట్ స్కేమ్‌ను ఓపెన్ చేయడం చాలా ఈజీ. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన 'బాబ్ వరల్డ్' మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్ ద్వారా డిజిటల్ పద్ధతిలో నిమిషాల్లోనే ఈ ఎఫ్‌డీని బుక్ చేసుకోవచ్చు. డిజిటల్ వాడకం రానివారు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఏ బ్రాంచ్‌కైనా వెళ్లి ఈ సదుపాయాన్ని పొందవచ్చు. మరీ ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో కరెంట్ లేదా సేవింగ్స్ అకౌంట్ లేని కొత్త కస్టమర్లు సైతం బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా నేరుగా ఆన్‌లైన్‌లో ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను సులభంగా బుక్ చేసుకునే సదుపాయాన్ని బ్యాంక్ కల్పించింది.