ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. రోజుకు కనీసం ఒక్క సారైనా బయట తినని వాళ్లు లేరు. ముఖ్యంగా బిర్యానీ, కబాబ్స్ వంటి స్పెషల్ ఐటమ్స్ కు హైదరాబాద్ లో ఉన్న గిరాకీ మరెక్కడా లేదు. దీంతో మారిన ట్రెండ్ తో రెస్టారెంట్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కస్టమర్స్ ను అట్రాక్ట్ చేయడంలో పోటీ పడుతున్నాయి. కానీ ఫుడ్ సేఫ్టీ విషయంలో మాత్రం వెనకబడి పోతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని రిస్క్ లో పెడుతూ.. లాభాలపైనే ఫోకస్ పెట్టి నడుపుతున్నాయి.
గురువారం (2026 జూన్ 18) హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన రైడ్స్ లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మియాపూర్, మదీనాగూడలోని అంతేరా రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ హ్యాండ్లర్ల మెడికల్ ఫిట్‌నెస్ రికార్డులు అందుబాటులో లేనట్లు గుర్తించారు.
నీటి నాణ్యత పరీక్ష నివేదికలు సమర్పించకపోవడంపై అధికారుల సీరియస్ అయ్యారు. డిజర్ట్స్, నాన్ వెజ్ ఐటమ్స్, మష్రూమ్స్, తరిగిన ఉల్లిపాయలను సరైన లేబులింగ్ లేకుండా నిల్వ చేసినట్లు గుర్తించారు. కాలీఫ్లవర్, బంగాళాదుంపలపై ఫంగస్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఆల్రెడీ ఉపయోగించిన వంట నూనె ను మళ్ళీ వాడటానికి స్టోర్ చేసినట్లు చెప్పారు అధికారులు. వాడిన నూనె మళ్లీ వాడటం చాలా ప్రమాదకరమని తెలిపారు. ఓపెన్ డస్ట్ బిన్లు, వ్యర్థాల నిర్వహణలో లోపాలు బయటపడినట్లు తెలిపారు. పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాల ఉల్లంఘనలపై రెస్టారెంట్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు.
