స.హ. చట్టాన్ని బలహీనపర్చే ప్రయత్నం.. రెండు దశాబ్దాల క్రితం అమల్లోకి వచ్చిన చట్టం 

స.హ. చట్టాన్ని బలహీనపర్చే ప్రయత్నం.. రెండు దశాబ్దాల క్రితం అమల్లోకి వచ్చిన చట్టం 

అవినీతి రహిత సమాజమే లక్ష్యంగా జనహితం కోరుతూ ప్రభుత్వ పథకాల్లో పారదర్శకత , కార్యాలయాల్లో అవినీతిని నియంత్రించడానికి రెండు దశాబ్దాల క్రితం అమల్లోకి వచ్చిన సమాచార హక్కు చట్టం. అయితే ఈ చట్టానికి చాప చుట్టే ప్రయత్నాలు ఆది నుంచి జరుగుతూనే ఉన్నాయి. ప్రజలకు వాస్తవాలను చెప్పడానికి, పరిపాలనలో నీతి నియమాలను పరిరక్షించడానికి ఉద్దేశించిన ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా బలహీనం పర్చే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నట్లుగా ఉంది. 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన డేటా ప్రొటెక్షన్ బిల్లులోని సెక్షన్ 30 (2) ద్వారా సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8ని సవరించాలని ప్రతిపాదించింది. తాజాగా కేంద్ర ఆర్థిక సర్వే సమాచార హక్కు చట్టాన్ని పున సమీక్షించాలని,  గోప్యమైన నివేదికలకు మినహాయింపులు ఇవ్వాలని,  చట్టం పరిధిని కుదించాలని పేర్కొనడం వల్ల సమాచార హక్కు చట్టం లక్ష్యం దెబ్బతిని ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది.

ఆర్థిక సర్వే సూచనలతో స.హ. చట్టం సమాధి

కేంద్ర ప్రభుత్వం జనవరి 29న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే సమాచార హక్కు చట్టాన్ని బలమైన ప్రజాస్వామ్య సంస్కరణగా పేర్కొంటూనే పున: సమీక్షించాలనీ సూచించినది. దేశంలో ప్రవేశపెట్టిన చట్టాలలో పౌర సమాజం ఎక్కువగా వినియోగించుకుంటున్న చట్టం సమాచార హక్కు చట్టం. అవినీతిపై యుద్ధం చేయడంలో ఇంతటి ప్రజాదరణ పొందిన ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా కోరలు పీకే ప్రయత్నం చేస్తోంది.

 తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థికసర్వే సమాచార హక్కు చట్టంపై కొన్ని సూచనలు చేస్తూ... గోప్యమైన సిబ్బంది నివేదికలకు మినయింపు ఇవ్వాలని, పాలనపై ప్రభావం చూపే కీలకమైన పత్రాల వెల్లడి విషయంలో నిరోధించడానికి పార్లమెంటరీ పర్యవేక్షణతో కూడిన మినిస్టీరియల్ వీటోను పరిశీలించాలని పేర్కొంది. అలాగే సిబ్బంది బదిలీలు గోప్య నివేదికలు వంటి సేవా రికార్డులను సమాచార హక్కు చట్టం నుంచి మినహాయించాలని సూచించింది.

 తుది నిర్ణయం తీసుకునేవరకు అంతర్గత చర్చల నోట్స్ ముసాయిదా నివేదికలను, పత్రాలను ఇవ్వవద్దని సమాచార హక్కు చట్టం పరిధిని కుదించాలని పేర్కొంది. ఈ సూచనలపై కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే సమాచార హక్కు చట్టం దరఖాస్తులను అధికారులు చాలా తేలిగ్గా తిరస్కరించే అవకాశం ఉంది. సాధారణ సమాచారం కూడా పౌర సమాజానికి అందడం గగనంగా మారుతుంది.

 వ్యక్తిగత గోప్యత చట్టంతో ఇబ్బందే

 ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వ్యక్తిగత గోప్యత చట్టంలోని సెక్షన్ 30(2) ఆర్టీఐ చట్టానికి సవరణను ప్రతిపాదించింది. వ్యక్తిగత సమాచారానికి మినహాయింపు ఇచ్చేవిధంగా సెక్షన్ 8(1)j ను పూర్తిగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కార్యరూపం దాలిస్తే సమాచార హక్కు చట్టం స్ఫూర్తి లక్ష్యం, ప్రజాప్రయోజనాలు దెబ్బతింటాయి. 

సమాచార హక్కు చట్టం అమలు ప్రశ్నార్థకంగా మారుతుంది. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8లో ఉన్నటువంటి ప్రధాన నిబంధన ‘విశాల ప్రజాప్రయోజనాల దృష్ట్యా’ ఇవ్వవలసిన సమాచారం ఇవ్వకుండా అధికారులు అడ్డుకునే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక సర్వే సమాచార హక్కు చట్టం నిర్వీర్యం అయ్యేవిధంగా ఇచ్చిన సూచనలు, సమాచార హక్కు చట్టాన్ని బలహీనపరుస్తాయి. వ్యక్తిగత గోప్యత చట్టంలోని ఉన్న నిబంధనలపై పౌర సమాజం ఉద్యమకారులు ఉద్యమిస్తేనే ఆర్టీఐ చట్టానికి మనుగడ, అక్రమార్కుల పట్ల వజ్రాయుధంగా మారిన బ్రహ్మాస్త్రానికి బలం చేకూరుతుంది. 

- అంకం నరేష్, యూఎఫ్ఆర్టీఐ రాష్ట్ర కో–కన్వీనర్-