V6 News

భూ పరిహారానికి ‘థంబ్’ తప్పనిసరి..ఎన్హెచ్ఏఐ కొత్త రూల్

భూ పరిహారానికి ‘థంబ్’ తప్పనిసరి..ఎన్హెచ్ఏఐ కొత్త రూల్
  • నిర్వాసితులు తప్పనిసరి రావాల్సిందే..
  • భూ సేకరణ విభాగాల సిస్టమ్స్​లో కొత్త సాఫ్ట్​వేర్​ 
  • భూమి రాశి పోర్టల్​కు అనుసంధానం
  • బయోమెట్రిక్​ డివైస్​ పంపిణీ
  • ఇప్పటికే పాన్​, ఆధార్​ సేకరణ

యాదాద్రి, వెలుగు :  నిర్వాసితులకు భూ పరిహారం పంపిణీలో  నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా(ఎన్​హెచ్​ఏఐ) రూల్స్​ మార్చింది. నిర్వాసితుల ‘థంబ్​’ తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించిన సాఫ్ట్​వేర్​ భూ సేకరణ విభాగాల్లోని కంప్యూటర్లలో అప్​లోడ్​ ప్రక్రియ ప్రారంభమైంది. 

ఎన్​హెచ్​ఏఐ ఆధ్వర్యంలో పలు ప్రాజెక్టులు...

ఎన్​హెచ్​ఏఐ ఆధ్వర్యంలో పలు ప్రాజెక్టులకు భూసేకరణ జరుగుతోంది. ప్రధానంగా రీజినల్​ రింగ్​ రోడ్డు (ట్రిపుల్​ ఆర్​) సంగారెడ్డి, మెదక్​, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలో దాదాపు 164 కిలోమీటర్లు నిర్మాణం కానుంది. అయితే సేకరిస్తున్న భూములకు ప్రైమరీ నోటిఫికేషన్​ (పీఎన్​) వేసిన సమయంలో పేర్కొన్న రిజిస్ట్రేషన్​ వాల్యూ ప్రకారం పరిహారం చెల్లింపు ఉంటుంది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్​ వాల్యూకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు పరిహారం ఎన్​హెచ్ఏ​ఐ అందిస్తోంది. 

పారదర్శకత కోసం ‘థంబ్’​ 

పరిహారం చెల్లింపులో పారదర్శకత కోసం ఇప్పటికే పలుమార్పులు చేసింది. తొలుత నిర్వాసితుడి నుంచి సేకరిస్తున్న భూమికి సంబంధించిన పట్టాదారు పాస్​బుక్స్, ఈసీతో పాటు పరిహారం జమ చేయడానికి బ్యాంక్​ పాస్​బుక్​ సేకరించేది. అనంతరం తప్పనిసరి కాకున్నా ఆధార్​ కార్డును తీసుకుంటోంది. 2024లో పాన్​ కార్డును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అప్పటివరకూ పాన్​ కార్డులు లేని వాళ్లందరూ కొత్తగా తీసుకోవాల్సి వచ్చింది. తాజాగా నిర్వాసితుల వేలిముద్రలు సేకరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పరిహారం చెల్లింపుల విషయంలో మరింత పారదర్శకత రానుంది. 

‘భూమి రాశి’ పోర్టల్​కు అనుసంధానం...

నిర్వాసితుల భూముల వివరాలతో పాటు బ్యాంక్​ పాస్​బుక్​, ఇతర ధ్రువీకరణ పత్రాలను భూమి రాశి పోర్టల్​లో అప్​లోడ్​ చేస్తుంటారు. ఇప్పుడు తాజాగా థంబ్​ తప్పనిసరి చేయడంతో జిల్లాల్లోని భూ సేకరణ విభాగాలకు చెందిన ఆఫీసుల్లోని కంప్యూటర్లలో కొత్త సాఫ్ట్​వేర్​ అప్​లోడ్​ చేస్తున్నారు. ఆ తర్వాత భూమిరాశి పోర్టల్​కు అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అనంతరం బయోమెట్రిక్​ డివైస్​ను అందిస్తున్నారు. 

వయసు పైబడినోళ్లకు ఇబ్బందే.. 

ఇప్పటి వరకూ భూ యజమానికి బదులు అతడి వారసులు అవసరమైన పత్రాలు అందించేవారు. వేలి ముద్రలు సేకరించాలన్న నిర్ణయంతో ప్రతీ నిర్వాసితుడు భూ సేకరణ చేసే కార్యాలయాలకు రావాల్సి ఉంటుంది.  వయసు పైబడిన వారు, మంచానికే పరిమితమైన వారు కూడా ఆఫీసులకు రావాల్సిందే. అయితే వయసు మీరిన వారికి వేలి ముద్రలు సరిగా పడవు. వృద్ధాప్య పింఛన్​ చెల్లింపు సమయంలో వేలి ముద్రలు సరిగా పడకపోవడం తెలిసిందే. ఈ మధ్యే ‘ఫేస్​ రికగ్నిషన్’ అమలు చేస్తున్నారు. ఈ విధానంలోనూ వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు.