V6 News

ఒక ప్లేట్ బిర్యానీ ఇంత సంతోషాన్ని ఇస్తుందా..? తండ్రీకొడుకుల హార్ట్ టచింగ్ వీడియో..!

ఒక ప్లేట్ బిర్యానీ ఇంత సంతోషాన్ని ఇస్తుందా..? తండ్రీకొడుకుల హార్ట్ టచింగ్ వీడియో..!

కోల్కత్తా: ఒక ప్లేట్ బిర్యానీ. మెట్రో నగరాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి ప్లేట్ బిర్యానీ తినడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ.. ఒక దిగువ మధ్య తరగతి కుటుంబానికి, పేద కుటుంబాలకు బిర్యానీ తినడం అనేది ఇప్పటికీ ఒక కలనే అని చెప్పక తప్పదు. ఒక పిల్లాడికి బిర్యానీ తినాలనే కల చాన్నాళ్లకు నెరవేరింది.

బిర్యానీ రేటుపై డిస్కౌంట్ ప్రకటించడంతో బిర్యానీని ఆ తండ్రి కొనగలిగాడు. కన్న కొడుకు బిర్యానీ తింటుంటే కలిగిన సంతోషాన్ని కళ్లారా చూడగలిగాడు. పశ్చిమ బెంగాల్‌లోని బగులా పట్టణంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు.

ఇలాంటి చిన్నచిన్న సంతోషాలు ఈ కుటుంబంలో మళ్లీమళ్లీ చూడాలని నెటిజన్లు ఆకాంక్షించారు. నారాయణ్ సర్కార్ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. అతనికి కేవలం 3 వేల 254 మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. తన దైనందిన జీవితంలోని విశేషాలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తన కొడుకు బిర్యానీ తింటుండగా ఆయన పోస్ట్ చేసిన వీడియోకు 5 లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం. అయినప్పటికీ ఇప్పటికీ 3 వేల 309 మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు.

మూడు బిర్యానీ ప్యాకెట్లు కొనుక్కుని ఫ్యామిలీతో కలిసి బిర్యానీ తినడమే నారాయణ్ సర్కార్ లాంటి పేద కుటుంబాలకు పండుగ లాంటి విషయం. అందుకే.. ఆయన తన ఫాలోవర్లతో ఈ వీడియోను పంచుకున్నారు. వీడియోలో ఆయన బెంగాలీలో మాట్లాడుతూ.. తన కొడుకు ఎప్పటి నుంచో బిర్యానీ అడుగుతున్నాడని చెప్పాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బిర్యానీని కొనివ్వలేకపోయానని, బిర్యానీ ధరలపై డిస్కౌంట్ ప్రకటించడం చూసి మూడు ప్యాకెట్లు కొన్నానని నారాయణ్ సర్కార్ చెప్పాడు.

బిర్యానీ తింటూ ఉన్న కొడుకు ముఖంలో సంతోషాన్ని చూసిన ఆ తండ్రి పట్టరాని ఆనందంతో తన మధురానుభూతిని ఫాలోవర్లతో పంచుకున్నారు. కన్న బిడ్డలు కోరింది ఇవ్వడంలో తల్లిదండ్రులకు ఉండే సంతృప్తి మాటల్లో చెప్పలేనిది. వీక్షకుల ఆశీస్సులు కోరుతూ నారాయణ్ సర్కార్ వీడియోను ముగించారు. ఎన్నో కుటుంబాలకు ఒక ప్లేటు బిర్యానీ ఇప్పటికీ ఒక లగ్జరీ ఫుడ్ ఐటమ్గా ఉందంటే పేదరికం ఇప్పటికీ మన దేశంలో ఎంతలా విలయ తాండవం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.