
సెయింట్ జార్జ్ (గ్రెనెడా): ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా.. వెస్టిండీస్‌తో నాలుగు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్‌లోనూ 133 రన్స్ తేడాతో గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మరోటి మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. ఆసీస్ నిర్దేశించిన 277 రన్స్ టార్గెట్‌ను ఛేదించేందుకు ఆదివారం (జులై 06) రాత్రి బరిలోకి దిగిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 34.3 ఓవర్లలో 143 రన్స్‌కు ఆలౌటైంది.
రోస్టన్ ఛేజ్ (34) టాప్ స్కోరర్. షామర్ జోసెఫ్ (24)తో సహా మిగతా వారందరూ ఫెయిలయ్యారు. స్టార్క్, లైయన్ చెరో మూడు వికెట్లు తీయగా, హేజిల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు 221/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 71.3 ఓవర్లలో 243 రన్స్‌కు ఆలౌటైంది. అలెక్స్ క్యారీ (30) ఫర్వాలేదనిపించాడు.
షామర్ జోసెఫ్ 4, జైడన్ సీల్స్, అల్జారీ జోసెఫ్, జస్టిన్ గ్రీవ్స్ తలా రెండు వికెట్లు తీశారు. అలెక్స్ క్యారీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన మూడో టెస్ట్ (డేనైట్) ఆదివారం నుంచి కింగ్‌స్టన్‌లో జరుగుతుంది.