అయోధ్య రామ మందిర ట్రస్ట్‌కు లీగల్ నోటీసులు.. రూ.7 కోట్ల దొంగతనం ఆరోపణలతో రాజకీయ రచ్చ!

అయోధ్య రామ మందిర ట్రస్ట్‌కు లీగల్ నోటీసులు.. రూ.7 కోట్ల దొంగతనం ఆరోపణలతో రాజకీయ రచ్చ!

అయోధ్యలోని  రామ మందిర ట్రస్ట్‌కు గట్టి షాక్ తగిలింది. ఆలయానికి వచ్చిన విరాళాలు, భూమి కొనుగోళ్ల లెక్కలు చెప్పాలంటూ కఠినమైన లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. గురువారం రోజున  బీహార్‌కు చెందిన ఆర్‌జేడీ ఎంపీ సుధాకర్ సింగ్.. సుప్రీం కోర్టు లాయర్ సత్యం సింగ్ రాజ్‌పుత్ ద్వారా ఆలయ కమిటీకి ఈ నోటీసులు పంపారు. గత ఐదేళ్ల ఆర్థిక వివరాల్లో పూర్తి పారదర్శకత ఉండాలని ఆయన డిమాండ్ చేశారు......

ఈ లీగల్ నోటీసును నేరుగా ఆలయ నిర్ణయాలు తీసుకునే ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్, ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరిలకు పంపించారు.

3 రోజుల్లో లెక్కలు చెప్పాలి
2021-2022 ఆర్థిక సంవత్సరం నుండి 2025-2026 వరకు ఆలయ ట్రస్ట్‌కు వచ్చిన ఆదాయం ఎంత ? ఖర్చు పెట్టింది ఎంత ? అనే పూర్తి వివరాలను నోటీసు అందిన 3 రోజుల్లోగా ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా ఆడిట్ రిపోర్ట్స్: బ్యాలెన్స్ షీట్లు, ఆదాయ-వ్యయాల అధికారిక నివేదికలు.., బ్యాంక్ అకౌంట్ల లావాదేవీల వివరాలు,  విదేశాల నుంచి వచ్చిన విరాళాల (FCRA) లెక్కలు.., అయోధ్యలో టెంపుల్ ట్రస్ట్ పేరు మీద కొనుగోలు చేసిన భూముల పూర్తి రికార్డుల వివరాలను అడిగారు.

రూ.7 కోట్ల దొంగతనం జరిగిందంటూ 
అయోధ్య మాజీ సమాజ్‌వాదీ పార్టీ (SP) ఎమ్మెల్యే పవన్ పాండే చేసిన కొన్ని సంచలన ఆరోపణల వల్లే ఈ రచ్చ మొదలైంది. ఆలయ విరాళాల లెక్కింపు గదుల నుండి సుమారు రూ. 7 కోట్ల నుండి రూ. 7.5 కోట్ల నగదును ఆలయ యాజమాన్యమే దొంగిలించిందని ఆయన ఆరోపించారు.

అయితే, ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ అబద్ధాలని, నిరాధారమైన వదంతులని కొట్టిపారేశారు. అయిన ప్రతిపక్షాలు ఈ విషయాన్ని వదలకుండా రాజకీయ దాడిని పెంచాయి.

సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలంటు
ఈ వివాదం కాస్త అధికార బీజేపీకి, ప్రతిపక్షాలకు మధ్య పెద్ద రాజకీయ యుద్ధానికి దారితీసింది.  SP  అధినేత అఖిలేష్ యాదవ్ ఈ డబ్బు లెక్కింపు వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని విమర్శించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టులో పిల్ (PIL - ప్రజా ప్రయోజన వ్యాజ్యం) వేశారు. అలాగే, డబ్బులు లెక్కించే గదికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

శివసేన UBT ఎంపీ సంజయ్ రౌత్  రాముడికి భక్తులు ఇచ్చిన కానుకల నుండి రూ. 5 కోట్లకు పైగా దోపిడీ జరిగినట్లు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. "యూపీలో, కేంద్రంలో మీ ప్రభుత్వాలే ఉన్నాయి.. దీనికి మీరే బాధ్యత వహించాలి. మీరు ఓట్లను, సీట్లను దొంగిలిస్తారు.. మీ ఎక్కడ చూసినా దొంగతనమే" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు, నిజానిజాలు తెలుసుకునేందుకు అయోధ్యకు ఒక ప్రతినిధి బృందాన్ని పంపే విషయంపై మా పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో చర్చిస్తున్నట్లు సంజయ్ రౌత్ వెల్లడించారు.