కథ..బలి మేక : బాడిశ హన్మంతరావు

కథ..బలి మేక : బాడిశ హన్మంతరావు

‘మామా... నువ్వు మా వైపు ఓటు వేస్తావన్నది, మేమిచ్చినది తీసుకుంటేనే ఖాయం అనుకుంటాం. లేకపోతే నీ ఇష్టం” అంటూ... అది బతిమిలాటో, బ్లాక్ మెయిలో అర్ధం కానట్టు మాట్లాడాడు.

సామాన్యరావుకి మాటి మాటికి అదే గుర్తుకు వస్తోంది. వాల్ పోస్టర్ వేళ్ళు అతని వైపే చూపిస్తున్నట్టు, సిగ్గు పడమని హెచ్చరిస్తున్నట్టుగా అనిపిస్తోంది. కొన్ని రోజుల కింద బజారులో ఒక చోట చూసిన వాల్ పోస్టర్. దానిపై ఎరుపు రంగు అక్షరాలతో పెద్దగా రాసి ఉన్న ఒక వాక్యం.‘ఓటు వేయడానికి డబ్బులు తీసుకోవడానికి నీకు సిగ్గు లేదా?’స్వతంత్రం వచ్చిన తరువాత మరో పండుగ.

ఎన్నికల్లో నిలబడిన వాళ్ళనుండి ఒకరిని ఎన్నుకునే పద్ధతిలో దేశంలో జరగబోతున్న మరో ఓట్ల పోటీ. ఈ పోటీలో మిగిలిన వారందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారు గెలిచినట్లు లెక్క. మిగిలిన వారికంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా సరే, ఆ అభ్యర్ధి గెలిచినట్లు ప్రకటించే పద్ధతి.కాస్త ముందుకు వెళ్ళగానే మరో చోట మరో వాక్యం. ‘‘నీ ఓటును నువ్వు అమ్ముకుంటే, నిన్ను నువ్వు అమ్ముకున్నట్టే!’’ ఆ వాక్యంతో పాటే ఓ  రాజకీయ  నాయకుడిని ప్రతిఫలించే పదజాలంతో, కుంభకోణాలనీ, కోట్లు మింగుతున్నాడని, ఓటు వేయడానికి నువ్వు డబ్బు తీసుకుంటే ఎలా నిలదీయగలవని... ఇంకా, ఇంకా... ఏవేవో రాసి ఉన్నయ్.


అతనికి ‘నిజమే’ అనిపించింది. అంటే సామాన్య రావు అప్పటివరకూ అలా తీసుకున్నాడని కాదు. ఈసారి కూడా అలాగే ఉండాలని అనుకున్నాడని. మొన్నటి ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు నిలబడ్డారు. సరేలే! నిలబడిన వాళ్ళలో ఒకరిని ఎంచుకొని ఓటు వేయొచ్చు అనుకున్నాడు.తెల్లారితే ఓట్లనగా ఒక అభ్యర్థి తరఫు బృందం వచ్చింది. ‘‘మామా, నీ ఓటు మాకే!’’ అందులో ఒకతను అన్నాడు.“సరే అల్లుడూ... అలాగే’’ చేతిలో ఎర్ర రంగు కాగితాలు పెట్టబోయాడు. “అబ్బే... అక్కరలేదు... నీకే వేస్తా.” అతను అనుమానంగా ఇంకా చెప్పాలంటే.... అపనమ్మకంగా ముఖంపెట్టాడు. ఇంతలో పక్కనున్న అనుచరుడు “ఎలాగూ వేసేటప్పుడు తీసుకుంటే ఏమైద్ది?’’ లా పాయింట్ తీశాడు.


‘‘ఓటు వేయడం నా బాధ్యత, దీనికి డబ్బులు ఎందుకు?’’ ఛాతి పొంగుతుండగా జవాబిచ్చాడు సామాన్యరావు.ఈసారి అందరూ మరింత అనుమానంగా చూశారు. ‘‘సరే మామా వస్తాం!’’ అంటూ అపనమ్మకంగానే వెళ్లారు.వాళ్ళు అటు వెళ్ళీ వెళ్ళగానే మరో అభ్యర్థి అనుచరగణం వచ్చింది. మళ్ళీ సంభాషణ అంతా అచ్చు గుద్దినట్లు అలాగే జరిగింది.


రాత్రి కాస్త పొద్దు పోయినాక మొదట వచ్చిపోయిన గుంపులో ఒకరు సామాన్యరావు ఇంటికి వచ్చాడు. ‘‘మామా... నువ్వు మా వైపు ఓటు వేస్తావన్నది, మేమిచ్చినది తీసుకుంటేనే ఖాయం అనుకుంటాం. లేకపోతే నీ ఇష్టం” అంటూ... అది బతిమిలాటో, బ్లాక్ మెయిలో అర్ధం కానట్టు మాట్లాడాడు.సామాన్యరావు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. తీసుకోకపోతే ఓటు వేయనట్టే. నిజంగా వేసినా, వేయనట్టే అనుకునేలా ఉన్నారు. అలా డబ్బు తీసుకోవడం తనకు ఇష్టం లేదు. ఎలా? కాసేపు తర్జనభర్జన తర్వాత  ఎర్ర కాగితాలు సామాన్యరావు జేబులోకి... అక్కడనుండి ఇంటిలో ఉన్న తిరుపతి వెంకన్నకు కట్టిన ముడుపులోకి వెళ్లిపోయాయి.
మరికాసేపటికే రెండవసారి వచ్చిన గుంపు. అచ్చం మళ్ళీ అలానే జరిగింది. మాటి మాటికి ‘నీకు సిగ్గు లేదా?’ అని ఎవరో నిలదీస్తున్నట్టు అనిపిస్తోంది. మొత్తం మీద అప్పటికి ఓటు హక్కును వినియోగించుకున్నాడు సామాన్య రావు.


చూస్తుండగానే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఈసారి ఎంపీ ఎలక్షన్స్. ఈ సారి మరో వాల్ పోస్టర్ కళ్ల బడింది. దాని మీద ఒక శవం బొమ్మ. పూర్తి నలుపు రంగుతో కాలి బొటనవేళ్లు రెండూ తాడుతో కట్టినట్టుగా వేసిన బొమ్మ.  పైన నలుపు రంగులో పెద్ద అక్షరాలు. ‘‘ఓటు వేయడానికి సొమ్ము తీసుకున్నావంటే నువ్వు శవంతో సమానం!’’ ఓటు వేయడానికి డబ్బులు తీసుకునే వారిని ఉద్దేశిస్తూ వేసిన బొమ్మ మీద రాసిన వాక్యం. అది చదివిన సామాన్యరావు తల కుంగిపోతోంది.


‘శవం...శవం...శవం...’ మెదడులో పురుగు తిరిగినట్టు ఆ పదం తిరుగుతోంది.‘ఓటు నిజాయితీగా వేసిన వారికి నిలదీసే హక్కు వస్తుందా? అసలు నాయకులన్న వాళ్లు కనపడతారా నిలదీయడానికి? అందుకు కూడా అపాయింట్​మెంట్ కావాలి గదా? ప్రతీ రోజూ పని చేసుకుంటేనే బతుకు నడిచే పరిస్థితి ఉంటే... ఇక నిలదీయడానికి పోయేదెప్పుడు? ఎవరు నాయకులైనా జనం బతుకులు మారతాయా?’ ప్రశ్న మీద ప్రశ్న మీద వేసుకుంటోంది సామాన్యరావు మనసు.


గమ్మత్తేమిటంటే అందరూ ప్రజాసేవ కొరకే అని గట్టిగా చెప్పడం. పాపం ప్రజలకు సేవ చేయడానికి ఎదురు డబ్బులు ఇచ్చి మరీ పోటీ చేయడం.ఎంత సులభంగా అంటున్నారు వీళ్ళు. ‘సిగ్గు లేద’ని ఒకరు, ‘శవం’ అని మరొకరు. నిలబడిన ప్రతీ వాడూ సొమ్ము పంచే వాడే అయినప్పుడు, తీసుకోకుంటే కంటు అయ్యే పరిస్థితిని ఎదుర్కోవడం ఎలా? అయినా ఓటు వేయడం హక్కు అయినప్పుడు, వేయకపోవడం హక్కు కాదా? పోనీ ఎవరూ నచ్చలేదని ‘నోటా’కు వేస్తే అది పరిగణనలోకే రానప్పుడు ఓటు వేయకపోవడానికి, నోటాకు వేయడానికి తేడా ఏముంది?’... సామాన్యరావు తర్కవితర్కాలతో గందరగోళ పడ్డాడు.


ఇంతలో అతనికి ఉన్నట్టుండి ఒక విషయం, మెదడులో మెరుపు వెంట మెరుపు కలిసి కాంతి పుంజం లాగ పాకింది. ‘ఓటు వేయడం తన బాధ్యత’ అని (సామాన్యరావు వైపు) నాలుగు వేళ్లు బిగించి, చూపుడు వేలెత్తి చూపుతున్న ప్రతీ ఒక్కరూ, నిలబెట్టే నాయకులను పార్టీలు బాధ్యతగా ఎంపిక చేయడం గురించి మాట్లాడట్లేదు. పోనీ గెలిచిన తరువాతనైనా బాధ్యతగా ప్రవర్తిసున్నారా? నేతి బీరలో నేయి చందమే. అందరూ బాధ్యతలు మరచి తనను మాత్రం బాధ్యతను నిర్వర్తించమని చెప్తున్నారు.
అలా చేయకపోతే ఒక హంతకుడి కంటే ఎక్కువ అనే రంగు పూస్తున్నారు. నిలబడ్డ ప్రతీ ఒక్కరూ వ్యాపార దృక్పథంతోనే నిలబడితే ఎవరిని ఎన్నుకోను?


అలాగే ‘తీసుకున్నవాడు శవం... తీసుకున్నవాడికి సిగ్గు లేదు’ అని రాస్తున్న వాళ్ళెవరు కూడా ఇచ్చే వాళ్ళని ఏమీ అనడం లేదు. ఒక్కరు కూడా?’డబ్బులు పంచే వాడికి సిగ్గు లేదనో, డబ్బులు పంచేవాడు శవమనో ...ఊహూ... ఎవరూ అనడం లేదు, తప్పు పట్టడం లేదు. చూడపోతే వాళ్ళు కూడా నాయకులకే వత్తాసు పలుకుతున్నట్టు అనిపిస్తోంది. ఏమో! ఇదీ నిలబడిన నాయకుల పనేనేమో! పోనీ ఎవరైతే ఈ విధంగా ప్రజలకు అవగాహన తెస్తున్నారో వారెవరో ఎక్కడా వారి గురించి మాత్రం ప్రకటించరు.


ఏమీ అనలేరు కదాని సామాన్యరావులను మాత్రం వేలెత్తి చూపుతూ అంటున్నారు. అసలు ఇచ్చేవాడే లేకపోతే ఇంతమంది తప్పు చేసే అవకాశమే లేదు-,- ఈ అంశాన్ని నీతులు చెప్తున్న అందరూ కన్వీనియెంట్​గా పక్కకు పెడుతున్నారు.గెలిచిన నాయకులు కూడా... మాట్లాడితే ‘ప్రజా కోర్టులో తేల్చుకుందాం-’ అని బహు ధైర్యంగా సవాల్ చేస్తారు. ఎలాగూ ప్రజాకోర్టు పెట్టేది లేదు. విషయం తేలేది లేదు. అదే అసలు ధైర్యం. సామాన్యరావుకు చీకట్లో వెలుతురు సాగి దారి కనబడ్డట్టు... ఏదో అర్థం అయినట్టనిపించింది.


ఎవరో అన్నట్టు ‘‘రాజ్యం ఇలాగే ప్రవర్తిస్తుంది. సామాన్యుల మీదే సవారీ చేస్తుంది. నాయకుల మీద కాదు. మేకలనే బలి ఇస్తారు, పులిని కాదు.”
ఇందులో మార్పు రావాలంటే ఏదో జరగాలి... మరేదో కావాలి! సామాన్యరావుకు మార్పు ఎక్కడి నుండి రావాలో స్పష్టం అవుతోంది. అది స్పష్టం అయిందంటే  మార్పు వచ్చినట్టే ! 

గెలిచిన నాయకులు కూడా... మాట్లాడితే ‘ప్రజా కోర్టులో తేల్చుకుందాం-’ అని బహు ధైర్యంగా సవాల్ చేస్తారు. ఎలాగూ ప్రజాకోర్టు పెట్టేది లేదు. విషయం తేలేది లేదు. అదే అసలు ధైర్యం. సామాన్యరావుకు చీకట్లో వెలుతురు సాగి దారి కనబడ్డట్టు... ఏదో అర్థం అయినట్టనిపించింది.ఎవరో అన్నట్టు ‘‘రాజ్యం ఇలాగే ప్రవర్తిస్తుంది. సామాన్యుల మీదే సవారీ చేస్తుంది. నాయకుల మీద కాదు. మేకలనే బలి ఇస్తారు, పులిని కాదు.”

‌‌- బాడిశ హన్మంతరావు
ఫోన్ : 990848661