రాజ్యాధికారమే ధ్యేయంగా రాజేసిన కొలిమి.. వాక్య నిర్మాణంలో కర్త, కర్మ, క్రియలు స్పష్టంగా ఉండాలి.!

రాజ్యాధికారమే ధ్యేయంగా రాజేసిన కొలిమి.. వాక్య నిర్మాణంలో కర్త, కర్మ, క్రియలు స్పష్టంగా ఉండాలి.!

గన్నోజు ప్రసాద్ మొదటి దీర్ఘ కవిత ‘కొలిమి’. ఇప్పటికే తొలి పొద్దు, వెన్నెల్లో చీకటి, జ్వలిత హృది.. వంటి పుస్తకాలతో సాహిత్య లోకానికి సుపరిచితులు. అస్తిత్వ ప్రకటనకు దీర్ఘ కవితా మార్గాన్ని ఎన్నుకోవడం సాహసమే. పాలధారలపై మీగడ రుచులను చూపించిన దిశా నిర్దేశిగా ‘కమ్మరి’ని సంబోధిస్తడు.

 చెమటనది, కొలిమి పెదాలు, వెలుతురు దిమ్మెలు, దిగులు నీడ ఇలా రకరకాల మెటాఫర్స్ కాంతిపుంజాలైతయి. సమాజమనే పలక, పనిముట్లనే అక్షరాలు, అద్దమై నిలబడ్డ చరిత్ర, ఆచారాలనే కొమ్మలు, సంప్రదాయాలనే ఆకులు, సంస్కృతులనే పువ్వులు, దుక్కి దున్నిన చేనులా, ముస్తాబైన ముత్తయిదువగా, వెన్నెల తరువై, కన్నుల వెలుగై, నిరంతర దీపమై ఇలా నేనేం తక్కువకాదని ‘సిమిలీ’లు పలకరిస్తయి. కవికి అలంకారాల మీద ఉన్న మక్కువను ఇలా తీర్చుకున్నడేమో అనిపిస్తది. 

ఒక పూర్తిస్థాయి దృశ్యాన్ని కనగలిగే లోపు బ్లింకింగ్ అవడం, పద చిత్రాలు భావచిత్రంగా రూపొందే క్రమంలో అసంపూర్ణత కనిపించడం వెనుక ఒకటికి మించిన దృశ్యాల్ని లింక్ చేయాలనుకోవడం స్లైడింగ్ ఫ్రిక్షన్​లా అనిపిస్తుంది. అంటే ఒక వస్తువుపై మరో వస్తువు నిలకడగా, స్థిరంగా ఉండలేదు. అలాగే రెండు దృశ్యతలాలు ఒకదానిపై ఒకటి స్పర్శలో ఉంటున్నట్లు అనిపించినా అవి అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తయి. కవి అనుకున్న భావం స్లిప్ అవడం గమనిస్తాం. 

పాఠకుడిని చేరే క్రమంలో ఇలాంటి భ్రాంతి ఎందుకు కలుగుతది? అని భావించినప్పుడు కవి చెప్పే విషయం- కాలాలు మారినప్పుడల్లా పాఠకుడి పఠన వేగం గతం నుంచి వర్తమానానికి, వర్తమానం నుంచి గతానికి మారకపోవడం వల్ల, అంటే ఒక భాగంలో చెప్పిన విషయం గతంలో జరిగినట్టుగా చెప్పి, మరో భాగంలో ప్రస్తుతం జరుగుతున్నట్టుగా చెప్తున్నప్పుడు  అస్పష్టత, సందిగ్ధతకి దారితీస్తది. 

వాక్య నిర్మాణంలో కర్త, కర్మ, క్రియలను స్పష్టంగా గుర్తించగలగాలి. కవి భావాన్ని అందుకునే క్రమంలో పాఠకులే విడదీసుకుని చదువుకుంటూ అర్థం చేసుకోవాల్సి ఉంటది. పూర్తిస్థాయిలో విషయాన్ని మొత్తంగా కవిత్వం చేయాలనే తలంపులోంచి సంయుక్త కవిత్వ వాక్యాలు వెల్లువలా దీర్ఘ కవితను ఆవరించినట్లుగా ‘కొలిమి’ ని చదువుతున్నప్పుడు అనుభూతి చెందుతాం.

కవిత్వం అంటే ఊహ ప్రధానం. పురాణ ప్రస్తావనలు, చారిత్రక నిర్ధారణలు, ప్రజల నమ్మకాలు కవిత్వంలో వాస్తవ అంశాలు ఉన్న క్రమంలో ఊహలు, కల్పనలు చారిత్రక నిర్ధారణ విషయంలో కచ్చితత్వాల్ని ప్రామాణికంగా, సాక్ష్యాలుగా వీలైనంత మేరకు తీసుకోవాల్సిన బాధ్యత కవులపై ఉంటది. కవి తనంత తానుగా చరిత్రను వక్రీకరించకుండా జాగ్రత్త పడాల్సి ఉంటది. అందుకు తగిన ఆధారాల్ని సిద్ధపరచుకొని ఒక భావనను ప్రవేశపెట్టవచ్చు.

బొబ్బలు చితికిన నీరు భోజనం చేయనివ్వకపోవడం, ఎండిన పేగులు పొగ గొట్టాలై కదలడం, పేదరిక జ్వాలలు కళ్ళను ఎరుపెక్కించడం, నొసలు పై హిమాలయాలు మోచేతి పై విమానాలు వంటి వ్యక్తీకరణలు, అత్త పిలుపును దొరగారి అరుపుతో అనుసంధానించడం, కాశ గడ్డి పందిరి నీడ, ఇంటి కాపలా గోడలయ్యే మోదుగాకు తోరణాలు, తనువును డొప్పలో ముడుచుకోవడం, చెమట తడితో గట్టి పడ్డ పెయ్యి మొదలైన ప్రతీకలు ఇటువంటి జీవిత గాథను, ఏ బతుకు చిత్రణను రూపిస్తుందో అది వాస్తవం. ఈ వాస్తవికతకు వర్ణన తోడై కళాత్మకంగా తీర్చిదిద్దబడే కవిత్వమై నిలిచిపోతది. అందుకు తగిన సందర్భాన్ని ఎంచుకోవడం కవి చేసే పని. కవికి తన పాఠకుల్ని నిర్దేశించుకునే పరిధి ఉండదు.. కొందరికి స్పష్టతనిచ్చే అంశం, మరికొందరికి అస్పష్టంగా అనిపించొచ్చు. 

ఒక స్థితికి ముందరి సందర్భాన్ని, ఆ స్థితికి తర్వాత సంఘటనకు ముడిపెట్టి చెప్పేందుకై కవి సామాజిక అంతరాల్ని ఆశ్రయిస్తడు. పాఠకులు కవి ఊహించిన భావ చిత్రాన్ని దృశ్యంగా అనుభవంలోకి తెచ్చుకుంటరు. సిద్ధపరచబడిన ప్రతీకలే అయినప్పటికీ అన్వయించబడుతున్న ‘వస్తువు’ కొత్తదైనప్పుడు దృశ్యం(‘కాడెడ్లు లేకుండానే కొట్టాల కాడి నాగళ్లు నడిసి రావడం’) అలరిస్తది.

 కవి సూర్యుడిని అర్ణపు అల్లుడుగా; ‘తిత్తి, డాకలి, కొలిమి’లను త్రిమూర్తులుగా, బాపును కసిగా, కార్మిక ధార్మికుడిగా రకరకాల పోలికలు చెప్తుంటడు. పోలికలు చెప్పేటప్పుడు ప్రాంతీయ సంస్కృతిని ప్రవేశపెట్టడం వల్ల నూతన అభివ్యక్తుల్ని సాధన చేస్తున్న కవి శ్రమ కనబడుతది. కొలిమికాడి బూడిద బాపు మీద పారుతదనే విషయాన్ని చెప్పడానికి ఐలోని జాతరలోని పెద్దపట్నం, యమునాడ రాజన్న కోడెమొక్కులు వంటివి ప్రతీకాత్మకంగా వాడటం చూస్తాం. 

కొలిమి మంటలు అభివృద్ధి పంటలుగా చెప్తోన్న కవి నాస్టాల్జియాను (రేగడి ముద్దలు కాళ్ళ బూట్లుగా తిరిగిన పాదాలు) నెమరేసుకుంటడు. కుటుంబంలోని గొడవల్ని సుత (పొద్దంతా కొలిమితో కుస్తీపడ్డ చేతులు అమ్మ వీపున ఎక్కడ సేద తీరుతాయోనని..) సున్నితంగా, హృద్యంగా చెప్తడు. పేదరికాన్ని ‘ఎగేసిన బొగ్గుట్టలు మిగిల్చిన బూడిద కుప్పలు విభూతి ఉండలుగా భుజిస్తూ’, ‘చిల్లులు పడ్డ కోకలు పట్టు వస్త్రాలుగా అద్దకం చీరలై మెరవడం’ వంటి కవిత్వ మడతల్లో దాచిపెట్టడం చూస్తాం.

 బహుజనులుగా తమ జీవితాల్ని శ్రమకు అంకితం చేసినా ఫలితం లేదనే విషయాన్ని చెప్తూ హెచ్చరికలు (కర్రు కాల్చి వాతలు పెట్టే సమయం ముందే ఉన్నది) జారీ చేయడం చూస్తాం. ఇసిరెలు, పనిముట్ల ప్రస్తావనతోపాటు శ్రమలోని వేదన (శానంగాట్లు పెట్టిన గాయాలు పుట్టుమచ్చల్లా దర్శనం ఇవ్వడం) బాధ్యతగా రూపుకడుతది.

 ‘వ్యవసాయ పనిముట్లన్నీ మా ఇంటి సారె లే..!’ అని చెప్పటం ద్వారా కమ్మరి లేని పూరి జీవితం ఊహించలేమనే విధంగా తల్లి ఇంటి ప్రేమను చూపిస్తూ సకల వృత్తులకు ఆనవాలుగా ‘కొలిమి’ని పొందిచ్చి కుదించిన తీరును కైగడుతడు. ‘పెయి మీది బూడిద రాలకముందే పొయ్యిమీద బువ్వకుండ పగిలేది’ వంటి వ్యక్తీకరణల ద్వారా వ్యసనాలు కుటుంబంలో గొడవలకు కారణం అవటం గురించి చెప్తూ తమ జీవితాల్లోని చీకట్లను హైలైట్ చేయడానికి చంద్రున్ని సైతం డిమ్ చేసే (చందమామకు కూడా భయమే/ ఏడ కాల్చి వాతలు పెడతరో అనీ/ మా ఏడుపుల చీకట్లను చెరపడానికి/ మా వాడల్లో కాలే పెట్టడు) సృజన నైపుణ్యం కవిది. కులమతాలకు కాల్చబడటం, అంటరానితనం అంటని నేలగా చెప్పడం చమత్కారంతోపాటు వసుధైక కుటుంబ భావనకు ‘కొలిమి’ని ప్రత్యేకంగా చెప్తడు.

కొలిమిని సబ్బండవర్ణాల జాతరగా చెప్తూ కొత్త సాలు సంబరం నపరింత పంచి పెడుతూనే ప్రభుత్వ పథకాల్లో కమ్మరుల పేరున ప్రత్యేక చూపు ఎందుకు లేదో ప్రశ్నిస్తడు. కమ్మరి తాతయ్య వారసత్వం తన దాక కొనసాగిన సృజన నిపుణతను తల్సుకుంటడు. సామెతలు జాతీయాల్లోని వృత్తిని కించపరిచే పదజాలాన్ని నిరసిస్తూనే కొలిమి తన అస్తిత్వాన్ని కోల్పోతున్న క్రమతను వల్ల వేస్తడు. 

వీరబ్రహ్మంను తలుచుకుంటూనే పనిలేక వలసలుపోతున్న విధానాన్ని చూసి కండ్లొత్తుకుంటడు. వృత్తికారుల కష్టాల కన్నీటి ప్రవాహానికి ఊరట ఎక్కడని ప్రశ్నిస్తడు. సమస్త వృత్తులతో ఉన్న పొత్తు ముచ్చట ముచ్చటే అవుతున్న పాడు కాలాన్ని  వలపోస్తూనే కొలిమిని నమ్ముకున్న శ్రమజీవులపై ‘ప్రభుత్వాల మనసు’ పథకాల రూపంలో వెల్లివిరియాలనే ఆశావ దృక్పథం కనిపిస్తది. కుల వివక్షతను నిరసిస్తడు. మేనిఫెస్టోనీ సూచాయగా ప్రకటిస్తూనే బహుజన తత్వాన్ని విడమరిచి చెప్పే ప్రయత్నం చేస్తడు. ‘దేశం పోకడలో దేహీ.. అని అడుగం’ అంటూ ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తడు.

- బండారి రాజుకుమార్,విమర్శకులు-