Cockroach Cafe: బొద్దింక.. నిన్నా మొన్నటి వరకు అది కనిపిస్తే చాలు చెప్పు కింద తొక్కి చంపేవాళ్లు.. ఎక్కడ కనిపిస్తే అక్కడ హిట్ కొట్టి చంపేవాళ్లు.. ఇంట్లో బొద్దింక కనిపిస్తే ఆడోళ్లు ఎగిరి గంతులేస్తారు.. బొద్దింక వెంట పడి మరీ చంపేస్తారు.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. కాక్రోచ్ జనతా పార్టీ పుట్టిన తర్వాత.. బొద్దింక అంటే అల్లాటప్పా కాదమ్మా.. అదో విప్లవం.. ఉద్యమం అన్నట్లుగా ఉంది. ఒకప్పుడు బొద్దింక అంటేనే అసహ్యంతో చూసినోళ్లు.. ఇప్పుడు బొద్దింక అంటేనే అదో పులిలా.. టైగర్ లా చూస్తున్నారు.
బొద్దింక పేరుతో హోటల్:
హోటళ్లల్లోని ఫుడ్ లో బొద్దింక రావటం పెద్ద ఇష్యూ.. అదో ఫుడ్ పాయిజన్ లా చూస్తాం.. అలాంటిది ఓ హోటల్ కు బొద్దింక.. అదేనండీ కాక్రోచ్ కేఫ్ అని పెడితే ఎలా ఉంటుంది.. ఊహించటానికే కొంచెం భయంగా ఉంది కదా.. ఇలాంటి భయాలను పటాపంచెలు చేస్తూ.. బీహార్ రాష్ట్రంలో ఏకంగా కాక్రోచ్ కేఫ్.. బొద్దింక పేరుతో హోటల్ పెట్టేశాడు ఓ జెన్ జీ కుర్రోడు. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇదో హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై నెటిజన్లు ఆసక్తిగా.. ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కాక్రోచ్ కేఫ్ లోని ఆహారంలో బొద్దింకలు, పురుగులు వస్తే ఇక మీరు కంప్లయింట్ చేయలేరు.. ఎందుకంటే అది బొద్దింక కేఫ్ కాబట్టి అంటూ ఓ నెటిజన్ కామెంట్ సైతం వైరల్ అయ్యింది.
మా ఫుడ్ ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్లీ వస్తారు:
హోటల్ కు కాక్రోచ్ పేరు పెట్టటంపై ఆ కుర్రోడిని ప్రశ్నిస్తే ఇలా అంటున్నాడు.. పేరులో కాక్రోచ్ ఉండొచ్చు.. మా ఫుడ్ క్వాలిటీలో మాత్రం రాజీ లేదు.. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్లీ మళ్లీ ఇక్కడికే వస్తారంటూ ధీమాగా చెబుతున్నాడు. అంతేనా.. దేశం మొత్తాన్ని నవ్వించిన.. పలకరించిన.. యువతలో ఉద్యమ స్ఫూర్తిని రగలించిన కాక్రోచ్ లకు మించిన పేరు ఏముంటుందీ.. అందుకే ఆ పేరుతో కాక్రోచ్ కేఫ్ అని పెట్టాను అంటున్నాడు. దేశంలో ఎన్నో పేర్లతో హోటల్స్ ఉండొచ్చు.. కాక్రోచ్ కేఫ్ మాత్రం ఒక్కటే.. ఇది నాదే.. బీహార్ రాష్ట్రంలోనే అంటూ గర్వంగా చెబుతున్నాడు ఆ యజమాని కుర్రోడు.
కాక్రోచ్ కేఫ్ లో మెనూ ఇదే బాస్:
కాక్రోచ్ కేఫ్ లో మెనూ ఏంటీ అనే అని అంటారా.. టీ, కాఫీ, మ్యాగీ, శాండ్ విచ్, కూల్ డ్రింక్స్, 'సిగరెట్లు ఇలా యూత్ కు సంబంధించినవి అన్నీ ఉన్నాయంటున్నాడు. మొత్తానికి కుర్రోడు కదా.. కుర్రకారు నాడి పట్టినోడు.. సోషల్ మీడియా ట్రెండ్ తెలిసినోడు.. పేరుకు తగ్గట్టుగానే కుర్రోళ్ల టేస్ట్ కు అనుగుణంగా ఐటమ్స్ ఉన్నాయంటున్నారు నెటిజన్లు. ఏదిఏమైనా కాక్రోచ్ కేఫ్ అని పేరు పెట్టాడు చూడండీ.. గట్స్ ఉండాలి బాసూ అంటున్నారు కాక్రోచ్ ఫ్యాన్స్..
