మే 15న విచారణకు హాజరవుతా. .సిట్ కు బండి భగీరథ్ మెయిల్

మే 15న విచారణకు హాజరవుతా. .సిట్ కు బండి భగీరథ్ మెయిల్

 కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు  భగీరథ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించారు  బండి భగీరథ్. మే 15న సిట్  విచారణకు హాజరవుతానని లేఖలో  తెలిపారు. 

 వివరాల్లోకి వెళ్తే.. బండి భగీరథ్   ఇవాళ(మే 12) మధ్యాహ్నం 2 గంటలకు  పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా హాజరుకాలేదు. ఈ క్రమంలో  మే 15న విచారణకు వస్తానని ఆయన పోలీసులకు మెయిల్ పంపారు. కేవలం విచారణకు హాజరు కావడమే కాకుండా.. ఈ కేసులో కొన్ని కీలక సాక్ష్యాధారాలను కూడా అధికారుల ముందు ఉంచుతానని భగీరథ్ తన లేఖలో పేర్కొన్నారు. సిట్ చేస్తున్న దర్యాప్తుకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని, నిజానిజాలు నిలకడగా బయటకు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

బండి భగీరథ్‌‌పై మే 8న నమోదైన పోక్సో కేసు నమోదైంది. బాధితురాలి స్టేట్‌‌మెంట్ ఆధారంగా రేప్ ​కేసుకు సంబంధించి  పోక్సో యాక్ట్‌‌లోని 5(1) రెడ్‌‌విత్‌‌ 6 సెక్షన్లనూ FIR​లో చేర్చారు. మే  8న బాధిరాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీఎన్‌‌ఎస్‌‌ 74,75తో పాటు మైనర్‌‌‌‌పై లైంగిక వేధింపులకు సంబంధించి పోక్సో చట్టంలోని 11 రెడ్‌‌ విత్‌‌ 12 సెక్షన్ల కింద పేట్‌‌ బషీరాబాద్‌‌ పోలీసులు ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

భగీరథ్‌‌ మేనమామకు నోటీసులు

దర్యాప్తులో భాగంగా బాధితురాలితో పోలీసులు మాట్లా డారు.ఈ క్రమంలోనే బాధితురాలిపై లైంగిక దాడి కూడా జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు మైనర్‌‌‌‌పై లైంగిక దాడికి సంబంధించి 5(1) రెడ్‌‌విత్‌‌ 6 పోక్సో సెక్షన్లను ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌లో చేర్చారు. నిందితుడు భగీరథ్‌‌కు నోటీసులు జారీ చేసేందుకు పేట్‌‌బషీరాబాద్ పోలీసులు కరీంనగర్‌‌ వెళ్లారు. కాల్​ డేటా ఆధారంగా  భగీరథ్‌‌ మామ ఇంటికి వెళ్లారు. భగీరథ్‌‌ అందుబాటులో లేకపోవడంతో.. ఆయన మేనమామ వంశీకృష్ణకు నోటీసులు అందించారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు భగీరథ్‌‌తో కలిసి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తమ ముందు హాజరుకావాలని ఆదేశించారు. హాజరుకాని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.