హైదరాబాద్ మెట్రోను బీజేపీ అడ్డుకుంటోందన్న కాంగ్రెస్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. SIR అంశంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు రెండు మతాల మధ్య విభేదాలు సృష్టించి బీజేపీని బద్నాం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ముస్లిం సమాజాన్ని తప్పుదోవ పట్టించినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మరింత వేగంగా అభివృద్ధి చెందాలంటే తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందన్నారు . రాష్ట్రంలో ఇప్పటివరకు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో బండి సంజయ్ పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏకంగా రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలపై బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
తెలంగాణలోని ముస్లింలంతా తమ వివరాలు నమోదు చేసుకోవాలి. స్థానిక ముస్లింలను బీజేపీ ఎప్పుడూ గౌరవిస్తుంది. కానీ, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులకు ఓటు హక్కు కల్పించాలనే కుట్ర కాంగ్రెస్‌దే. దేశంలో జాతీయ రహదారులు, రక్షణ, వైద్య, విద్య, పారిశ్రామిక రంగాలను మోదీ ప్రభుత్వం నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లిందని బండి సంజయ్ కొనియాడారు. ప్రధానమంత్రి రోజ్‌గార్ మేళా ద్వారా ఏడాదిన్నర కాలంలోనే 12 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. కిసాన్ సమ్మాన్ నిధి, పెంచిన ఎంఎస్‌పీ (MSP) ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్టార్టప్ ఇండియా ద్వారా 23 లక్షల మందికి ఉపాధి లభించిందని, విదేశీ వస్తువుల కంటే స్వదేశీ ఉత్పత్తులనే ప్రజలు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు భావజాలం సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తోందని... తుపాకీ సంస్కృతి, హింస ద్వారా ఎలాంటి సమస్యలకూ పరిష్కారం లభించదని బండి సంజయ్ స్పష్టం చేశారు.
