ఉజ్జయిని మహంకాళి(లష్కర్) బోనాలు..175 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

ఉజ్జయిని మహంకాళి(లష్కర్) బోనాలు..175 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

భక్తులకు గుడ్ న్యూస్.. ఉజ్జయిని మహంకాళీ బోనాల జాతరకు టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. ఎల్లుండి (ఆగస్టు 2) నుంచి రెండు రోజులపాటు సాగే అమ్మవారి జాతరకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 175 స్పెషల్ బస్సులను నడపనునున్నారు. అవసరమైతే బస్సుల సంఖ్యను పెంచుతామని ఆర్టీసీ తెలిపింది.వీటితో పాటు భక్తుల సమాచారం కోసం  హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు భక్తుల సౌకర్యార్థం ఆగస్టు 2, 3 తేదీల్లో మొత్తం 175 ప్రత్యేక బస్సులను  నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సీటీలోని పలు ప్రాంతాల నుంచి నేరుగా సికింద్రాబాద్‌కు స్పెషల్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. 

ఎంజీబీఎస్‌ , చార్మినార్, కాచిగూడ, జూబ్లీ బస్ స్టేషన్‌తో పాటు బాలాజీనగర్, నాంపల్లి, రిసాలా బజార్, వెంకటాపురం, ఓల్డ్ అల్వాల్, కుషాయిగూడ, చర్లపల్లి, హకీంపేట్, ఓల్డ్ బోయిన్‌పల్లి, సైనిక్‌పురి, సనత్‌నగర్, జామియా ఉస్మానియా, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కేపీహెచ్‌బీ, బోరబండ, పటాన్‌చెరు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. 

భక్తుల సంఖ్య మరింత పెరిగితే అవసరాన్ని బట్టి అదనపు బస్సులను పెంచుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరోవైపు భక్తులకు సమాచారం, రూట్స్ వివరాలు తెలిపేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్‌లలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేక సిబ్బంది విధుల్లో ఉంటారు.

బోనాల జాతర సందర్భంగా  ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని బస్సుల నడిచే రూట్లో మార్పులు ఉంటాయని అధికారులు చెప్పారు.పోలీసుల సూచనలను పాటిస్తూ ప్రయాణించాలని కోరారు. వ్యక్తిగత వాహనాల కంటే ఆర్టీసీ ప్రత్యేక బస్సులను వినియోగిస్తే రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణం కూడా సులభంగా ఉంటుందని టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు భక్తులకు సూచించారు.