అది పరుగు పందెం కాదు.. స్విమ్మింగ్ పోటీలు కావు. కానీ గేట్లు ఎత్తినప్పుడు దూకే నీటి ప్రవాహంలా.. నేలపై చీమల్లా.. నీళ్లలో బారులు తీరిన బాతుల్లా.. ప్రాణాలను లెక్కచేయకుండా వలసదారులు పరుగులు తీసిన వీడియో.. ఈదలేక అలసిపోయి సముద్రంలో మునిగిపోతున్న విజువల్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. మొరాకో నుంచి స్పెయిన్ లోకి కేవలం 24 గంటల్లో 50 వేల మంది మైగ్రెంట్స్ ఎంట్రీ ఇవ్వడం సంచలనంగా మారింది.
వలస పక్షుల మాదిరిగా తమ దేశంపై దండయాత్ర చేస్తున్నట్లు వచ్చిన వలసదారులను అడ్డుకునేందుకు స్పెయిన్ దేశం.. ఉత్తర ఆఫ్రికా లోని సెయుటా ప్రాంతంలో హుటాహుటిన బలగాలను మోహరించింది. రాత్రికి రాత్రే 50 వేల మంది బార్డర్ క్రాస్ చేయడం.. ఈ మధ్యకాలంలో జరిగిన అతిపెద్ద సరిహద్దు ఉల్లంఘన ఇదే అంటే ఆశ్చర్యంలేదు.
స్పెయిన్ లోకి వెళ్లకుంటే ప్రాణాలను కాపాడుకోలేం అన్నట్లుగా సముద్రంలో ప్రాణాలను లెక్కచేయకుండా చేసిన ప్రయాణంలో 18 మంది చనిపోవడం ఆందోళన కలిగించే అంశం. వలసదారులు తాకిడితో అలర్ట్అయిన స్పెయిన్ కు అన్నిరకాల సాయం అందించేందుకు యూరోపియన్ దేశాలు ముందుకు వచ్చాయి.
Thousands of migrants have streamed into the tiny Spanish territory of Ceuta in North Africa from Morocco, prompting local officials to call for help from Spain’s national government in Madrid to restore the border. pic.twitter.com/S2fTWapBzR
— The Associated Press (@AP) July 30, 2026
ఎందుకు ఈ మాస్ వలస..
మాస్ వలస గురించి తెలుసుకునే ముందు.. సియూటా భౌగోళిక పరిస్థితులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సియూట అనేది స్పెయిన్ కు ఉన్న అటానమస్ సిటీ. ఈ సిటీ దాదాపు ఆఫ్రికాలో ఉంటుంది. మొరాకో ఉత్తర తీరాన ఉన్న సియూటాను, స్పెయిన్ నుంచి జీబ్రాల్టర్ జలసంధి వేరు చేస్తుంది. ఆఫ్రికాతో భూ సరిహద్దు ఉన్న ఏకైక సిటీ ఇది. ఆఫ్రికా వలస దారులకు యూరప్ వెళ్లేందుకు ఉన్న ఏకైక మార్గం ఇది కావడంతో వలసదారుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
సియూటా సిటీలో 80 వేల మంది నివసిస్తుంటారు. 1580 నుంచి స్పెయిన్ పాలనలో కొనసాగుతుంది. సియూటా, మెలిల్లా స్పెయిన్ ఆధీనంలో ఉన్న భూభాగాలుగా కొనసాగుతున్నాయి.
స్పెయిన్ లో ఈ సంక్షోభం తొలిసారి కాదు. గత కొన్నేండ్లుగా లాటిన్ అమెరికన్లు, ఆఫ్రికన్లు బార్డర్ దాటేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు.
స్పెయిన్ వలస సంక్షోభం 2021లో పీక్స్ కు చేరుకుంది. రెండు రోజుల్లో 10 వేల మంది సియూటా బార్డర్ కు చేరుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత 2022లో మెలిల్లా లోకి ఎంటర్ అయ్యే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 23 మంది చనిపోయారు. మొరాకో నగరాలైన ఫ్నిడెక్, బెలియోనెక్ నుంచి దాదాపు 6 కిలోమీటర్లు సముద్ర మార్గాన్ని దాటేందుకు ప్రయత్నించి చాలా మంది చనిపోతూనే ఉన్నారు.
కారణాలేంటి..?
మంచి ఉపాధి, ఉద్యోగం, ప్రశాంతమైన జీవితం కోసం ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి చాలా మంది బార్డర్ దాటేందుకు ప్రయత్నించడం చాలా కాలంగా జరుగుతూనే ఉంది. ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉన్న పేదరికం, హింసను తప్పించుకునేందుకు స్పెయిన్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు అక్కడి ప్రజలు.
గురువారం (జులై 30) వేల మంది వలసదారులు సియూటా దగ్గరికి చేరుకుని.. స్పానిష్ మట్టిని ముద్దాడేందుకు పడుతున్న యాతనకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. స్పెయిన్ బార్డర్ లో సరైన బలగాలు లేక వలస దారులు చొచ్చుకురావడంపై.. స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ పై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
సడెన్ గా ఎందుకు ఇంత వలస..
స్పెయిన్ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో స్పెయిన్ బార్డర్ లో పరిస్థితులు మారినట్లు చెబుతున్నారు. సియూట లేదా మెలిల్లా సిటీలకు ఎంటరయ్యే క్రమంలో సముద్రం దగ్గర అదుపులోకి తీసుకున్న వలసదారులను మొరాకో పంపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ ఉత్తర్వులను దుర్వినియోగం చేసుకుని మానవ అక్రమ రవాణా చేసే ప్రమాదముందని.. సియూటా ద్వారా యూరోప్ లోకి అక్రమ వలసలు పెరిగే ప్రమాదముందని స్పెయిన్ ప్రభుత్వం వాదిస్తోంది.
సుప్రీం తీర్పుతో చేతులెత్తేసిన మొరాకో
అయితే స్పెయిన్ లోకి అక్రమ వలసలను అరికట్టడంలో మొరాకో ముందునుంచి కఠిన చర్యలు తీసుకుంటూ వస్తోంది. సుప్రీం కోర్టు లేటెస్ట్ తీర్పుతో మొరాకో ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వలసదారులను నియంత్రిచే విషయంలో చేతులెత్తేసింది. కోర్టుతీర్పుతో బార్డర్ దగ్గర మైగ్రెంట్స్ ను కంట్రోల్ చేయలేమని తేల్చి చెప్పింది.
యూరప్ పై ప్రభావం..
లేటెస్టుగా జరిగిన పరిణామాలు యూరప్ పై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు చెబుతున్నారు. ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి బెటర్ లైఫ్ కోసం యూరప్ కు వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్న క్రమంలో.. ఇలాంటి పరిణామాలు అక్రమ వలసదారులు మరింత పేట్రేగిపోయే ప్రమాదముందని యూరోపియన్ కంట్రీస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
యూరోప్ కు వలసలు తీవ్రంగా ఉన్న క్రమంలో 2015 తర్వాత.. వలస దారుల రాక తగ్గినట్లు చెబుతున్నారు. యావరేజ్ గా ఒక ఏడాదిలో రెండు లక్షల వసల దారులు యూరోప్ కు వచ్చేవారు. అదే 2025లో లక్ష 54 వేల మంది యూరప్ కు వలస వెళ్లారు.
ప్రస్తుతం సియూట దగ్గర ఉన్న పరిస్థితులపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వలసలను అరికట్టేందుకు అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
