గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో బ్యాంకులు భాగస్వాములు కావాలి : మంత్రి తుమ్మల

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో బ్యాంకులు భాగస్వాములు కావాలి : మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వ్యవసాయ రుణాలు కేవలం పంటకే పరిమితం చేయకుండా మౌలిక వసతులు, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ చైన్ రంగాలకు విస్తరించాలని బ్యాంకు అధికారులకు సూచించారు.

శుక్రవారం ప్రజాభవన్‌‌లో 49వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ రంగాలు, మౌలిక వసతుల కింద మొత్తం రూ.1,68,401 కోట్ల రుణాలు పంపిణీ చేసి 101.88 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు.

అగ్రికల్చర్ ​లోన్లలో అధిక భాగం స్వల్పకాలిక పంట రుణాలకే పరిమితమవుతోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. గోదాములు, కోల్డ్ స్టోరేజీలు, ప్యాక్ హౌస్‌‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, డ్రిప్ ఇరిగేషన్, సోలార్ వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ రంగాలకు దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలు అందించాలని కోరారు. వ్యవసాయ ఎన్‌‌పీఏలు 5.23 శాతం నుంచి 4.71 శాతానికి తగ్గడం, టర్మ్ లోన్ల ఎన్‌‌పీఏలు 2.62 శాతం ఉండడం రైతుల నిబద్ధతకు నిదర్శనమన్నారు.

పెరిగిన వరి, మక్కజొన్న ఉత్పత్తి..  

రాష్ట్రంలో వరి, మొక్కజొన్న ఉత్పత్తి  పెరగడంతో నిల్వ సామర్థ్యం, గోదాములు, డ్రైయింగ్ యార్డులు, రవాణా, లాజిస్టిక్స్‌‌పై ఒత్తిడి పెరిగిందని మంత్రి తెలిపారు. కేవలం 6 శాతం సాగులో ఉన్న హార్టికల్చర్ వాటా 25 శాతం వరకు ఉందని చెప్పారు. ఏటా రూ.4,500 కోట్ల విలువైన కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, దీని వల్ల కోల్డ్ చైన్, నిల్వ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అవకాశాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.