ప్రగతిభవన్ గ్రిల్స్​కు ముళ్ల కంచె.. షాక్ కొట్టేలా సోలార్ కరెంట్!

ప్రగతిభవన్ గ్రిల్స్​కు ముళ్ల కంచె.. షాక్ కొట్టేలా సోలార్ కరెంట్!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు తీరు, ప్రజా సమస్యలపై వరుసగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రగతిభవన్​ వద్ద భద్రతను పెంచారు. గతంలో ప్రగతిభవన్ గేట్లు, గ్రిల్స్ ఎత్తు తక్కువగా ఉండగా ఇటీవలే 15 ఫీట్ల దాకా పెంచారు. తాజాగా గ్రిల్స్ కు ఇనుప ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రగతిభవన్ ముట్టడి సమయంలో ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు గేటు దూకిన ఘటన సంచలనం సృష్టించింది. దానికి ముందు, తర్వాత పలు ప్రజా, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేశారు. దీంతో భద్రతను పెంచామని పోలీసులు చెప్తున్నారు. ఆందోళనకారులు గేటును, గ్రిల్స్ ను ముట్టుకుంటే షాక్ కొట్టేలా సోలార్  కరెంట్ అటాచ్​ చేశామని అంటున్నారు.

ప్రగతిభవన్ ను ముట్టడించిన లంబాడా నేతలు

గిరిజనులకు మూడెకరాల చొప్పున భూమి పంపిణీ చేయాలని డిమాండ్​ చేస్తూ లంబాడా హక్కుల నేతలు శుక్రవారం ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు. జనాభా ప్రకారం గిరిజనులకు రిజర్వేషన్లు కల్పి్ంచాలని నినాదాలు చేశారు. కొత్తగా ఏర్పడ్డ ఎస్టీ గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని, తండా డెవలప్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హరితహారం పేరుతో గిరిజనుల భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆవిర్భానికి ముందు గిరిజనుల సమస్యలు తీరుస్తానని హామీలు ఇచ్చిన కేసీఆర్.. ఇంత వరకు వాటిని నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ ఆందోళనతో ప్రగతిభవన్​ వద్ద కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నేతలను అరెస్టు చేసి, ​స్టేషన్లకు తరలించారు.