న్యూఢిల్లీ: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. మెగా టోర్నీ సమయంలో ఆటగాళ్లు తమ కుటుంబాలతో ఉండకుండా నిషేధం విధించింది. కావాలనుకుంటే కుటుంబ సభ్యుల కోసం ప్లేయర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఆటగాళ్లు మ్యాచ్ పై ఏకాగ్రత కోల్పోకుండా ఉండటంతో పాటు ఇతర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. గతంలో కూడా బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
COVID-19 మహమ్మారి సమయంలో ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను మొత్తం టూర్లలో పాల్గొనడానికి బీసీసీఐ అనుమతించింది. కానీ 2025 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ పర్యటనలో ఆస్ట్రేలియాపై భారత్ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆటగాళ్ల కుటుంబ సభ్యుల బస విషయంలో బీసీసీఐ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది.
కొత్త నిబంధనల ప్రకారం.. విదేశీ పర్యటన వ్యవధి 45 రోజులు దాటితే ఆటగాళ్లు తమ భార్యలు లేదా కుటుంబ సభ్యులను గరిష్టంగా 14 రోజుల పాటు తమ వెంట ఉంచుకునే వెసులుబాటు కల్పించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
2026 వరల్డ్ కప్ కు ఇండియా, శ్రీలంక సంయుక్తంగా అతిథ్యమిస్తున్నాయి. భద్రతా పరమైన కారణాలతో పాకిస్తాన్ ఇండియాలో పర్యటించేందుకు నిరాకరించింది. దీంతో ఇండియా, పాక్ మ్యాచులను శ్రీలంక వేదికగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పాక్ తో మ్యాచ్ ఆడేందుకు టీమిండియా శ్రీలంక వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆటగాళ్లు తమ కుటుంబాలతో ఉండకుండా బీసీసీఐ నిషేధం విధించింది.
