బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. ఇంటి యజమానురాలు (65)పై ఓ పనివాడు అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ వృద్ధురాలు మరణించగా.. నిందితుడు కూడా అదే గదిలో ఉరేసుకుని చనిపోయాడు. దుబాయ్ నుంచి తిరిగొచ్చిన బాధితురాలి భర్త.. బెడ్రూంలో మృతదేహాలను చూసి పోలీసులకు ఫోన్ చేశారు.
బెంగళూరులోని కేఏఎస్ కాలనీలో జరిగిన ఈ దారుణం వివరాలు.. ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి కేఏఎస్ కాలనీలో భార్య (65), కూతురు (26) తో కలిసి ఉంటున్నారు. వారి ఇంట్లో తమిళనాడుకు చెందిన దేవరాజు (45) పదేళ్లుగా పనిచేస్తున్నాడు. కొంతకాలం బయట హాస్టల్లో ఉన్న దేవరాజును.. ఆ కుటుంబం తమ ఇంట్లోనే ఉండిపొమ్మని చెప్పింది.
ఇంట్లో పనులు చేస్తూ రాత్రి పూట హాల్లో పడుకునేవాడు. భార్యాభర్తలు అదే ఫ్లోర్‌లోని బెడ్రూంలో, కూతురు పైఅంతస్తులోని మరో బెడ్రూంలో పడుకునేవారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం దుబాయ్ వెళ్లిన ఇంటి యజమాని.. శనివారం అర్ధరాత్రి సమయంలో ఇంటికి తిరిగొచ్చాడు. బెల్ కొట్టినా ఎంతసేపటికీ తలుపుతీయకపోవడంతో కూతురుకు ఫోన్ చేయగా ఆమె వచ్చి డోర్ తెరిచింది.
హాల్లో దేవరాజు కనిపించకపోవడం గమనించినా తెల్లవారి అడగొచ్చులెమ్మని ఆయన బెడ్రూంలోకి వెళ్లాడు. అక్కడ బెడ్‌పై తన భార్య అచేతనంగా పడి ఉండడం, అదే గదిలో దేవరాజు ఉరికి వేలాడుతుండడం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని పరీక్షించగా.. ఇద్దరూ చనిపోయారని తేలింది.
పోస్ట్ మార్టంలో మహిళపై అత్యాచారం జరిగిందని, గొంతు నులమడం వల్ల ప్రాణం పోయిందని బయటపడింది. దీంతో దేవరాజే ఈ ఘోరానికి పాల్పడ్డాడని పోలీసులు సందేహిస్తున్నారు. అయితే, దేవరాజు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది తెలియరాలేదు. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
