హెల్మెట్ ఫైన్‌కు డబ్బుల్లేక మంగళసూత్రం తీసిచ్చింది

హెల్మెట్ ఫైన్‌కు డబ్బుల్లేక మంగళసూత్రం తీసిచ్చింది
  • హెల్మెట్​ లేదని ఫైన్​ కట్టమంటే.. డబ్బుల్లేక మంగళసూత్రం తీసిచ్చింది
  • బెంగళూరులో ఘటన.. సోషల్ ​మీడియాలో వీడియో వైరల్

బెంగళూరు: బజారులో ఓ మంచం తెచ్చుకుందామ ని వెళ్లిన భార్యాభర్తలను ట్రాఫిక్​ పోలీసులు ఆపేసిన్రు.. హెల్మెట్​ లేకుండా బండి నడిపినందుకు ఫైన్​ కట్టాలని చలాన్​ రాసిన్రు. ఎంత బతిలాడినా ట్రాఫిక్​ పోలీసులు వినకపోవడంతో చివరకు ఆ మహిళ తన మెడలోని మంగళసూత్రం తీసిచ్చింది. కర్నాటక రాజధాని బెంగళూరులో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. సిటీకి చెందిన భారతి విభూతి శనివారం భర్తతో కలిసి మార్కెట్​కు వెళ్లింది. ఇంట్లో కి ఓ మంచం కొనాలని రూ.1800 తీసుకుని భార్యాభర్తలు ఇద్దరూ బైక్​పై వెళ్లారు. ఓ దుకాణంలో రూ.1700 పెట్టి మంచం కొన్నరు, మిగిలిన వందతో హోటల్​లో టిఫిన్​ చేశారు. తర్వాత మంచం తీసుకుని ఇంటికి బయల్దేరారు. మధ్యలో వీళ్లను ట్రాఫిక్​ పోలీస్​ ఆపేసిండు. హెల్మెట్​ పెట్టుకోలేదని రూ.500 ఫైన్​ వేసిండు. తెచ్చుకున్న డబ్బు మంచం కొనడానికే సరిపోయిందని,  తమను వదిలిపెట్టాలని భారతి చాలాసేపు బతిలాడింది. అయినా ట్రాఫిక్​ సిబ్బంది వినలే.. డబ్బు కట్టి వెళ్లాలని పట్టుబట్టిన్రు. దీంతో విసిగిపోయిన భారతి తన మెడలోని మంగళసూత్రం తీసిచ్చి, దానిని అమ్మి ఫైన్​ వసూలు చేసుకొమ్మని చెప్పింది. ఈ తతంగమంతా 2 గంటల పాటు సాగింది. ఆ దారినపోయేటోళ్లంతా అక్కడ గుమికూడిన్రు. ఎవరో దీన్నంతా వీడియో తీసి సోషల్​మీడియాలో పెట్టడంతో అది వైరల్​గా మారింది. ఇదంతా జరుగుతుండగా అదే తోవలో వెళుతున్న పోలీస్​ ఉన్నతాధికారి ఒకరు అక్కడ ఆగి, విషయం తెలుసుకున్నరు. భారతి మంగళసూత్రం ఆమెకు తిరిగిచ్చేసి, వాళ్లను ఇంటికి పంపించారు.